టాలీవుడ్ బుట్టబొమ్మగా ముద్దుగా పిలుచుకునే తెలుగు ప్రేక్షకులు, అభిమానులే తన జీవితమని ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే తెలిపారు. కరోనాని తరిమి కొట్టే క్రమంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా పూజా ట్విటర్‌లో తన అభిప్రాయాలను, మనోభావాలను అభిమానులతో పంచుకున్నారు. సరదాగా సాగిన ట్విటర్ చాట్ ముచ్చట్ల గురించి తెలుసుకుందాం.
మన ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నా ప్రస్తుతం మనం జాగ్రత్తగా జీవించాలంటే ఇంట్లో ఉండటమే శ్రేయస్కరమని, ఈ ఖాళీ సమయాన్ని తాను సద్వినియోగం చేసుకుంటున్నట్టు పూజా హెగ్డే వెల్లడించారు. తనను తాను పునర్న్మించుకోడానికి లాక్‌డౌన్ సమయాన్ని వినియోగించుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
ఎంతో మంది మహిళలు తనలో స్ఫూర్తి నింపారని, ఇక తెలుగు అభిమానుల విషయానికి వస్తే వాళ్లే తన జీవితమని పూజా హెగ్డే తెలిపారు. బాలీవుడ్ హీరో షారుక్‌ఖాన్‌పై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నకు…కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా ఆమె అభివర్ణించారు. అలాగే తన కెరీర్ ప్రారంభంలో ముకుందా సినిమాలోని గోపికమ్మా అనే మంచి సోలో సాంగ్ చేయడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో తనను గోపికమ్మా అని కూడా పిలుస్తారన్నారు.
వింత అనిపించే పనులేవైనా చేశారా అనే ప్రశ్నకు ఆమె తన బాల్యంలోకి వెళ్లారు. తనకు చిన్నప్పుడు శాంటా అంటే ఎంతో నమ్మకం ఉండేదన్నారు. ఆయన గురించి కథలు వినడంతో పాటు ఉత్తరాలు కూడా రాసినట్టు ఆమె చెప్పుకొచ్చారు. సమయం చూసుకుని ఆ అనుభవాలను పంచుకుంటానని అభిమానులతో ఆమె అన్నారు.
అలాగే తనకిష్టమైన సంగతులను కూడా పంచుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోని మనసా మనసా అంటే తనకిష్టమైన పాటగా చెప్పారు.తాను నటి కాకపోయి ఉంటే…స్టైలిష్ట్, ఫొటోగ్రాఫర్ అయ్యి ఉండేదాన్ననన్నారు. తన అభిమాన గాయకుడు, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అని పూజా చెప్పారు. ఇన్‌స్టా, వాట్సప్ యాప్‌లను తానెక్కువగా ఉపయోగించే యాప్స్ అని పూజా తెలిపారు.
చివరిగా తనను ఫిదా చేసిన హీరో గురించి కూడా పూజా హెగ్డే చెప్పారు. ఆ హీరో ఎవరో కాదు…బాలీవుడ్ అందగాడు హృతిక్ అని చెప్పి తన సంతోషాన్ని వ్యక్తపరిచారామె. అంతేకాదు, మనిషి, మనసు అందంగా ఉండే హీరో హృతిక్ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా చాలా అరుదుగా ఉంటారని ఆమె తనను ఫిదా చేసిన హీరో గురించి ట్విటర్‌లో చెప్పుకొచ్చారు.