బన్నీ సినిమా థియేటర్లలోకి వచ్చి వచ్చే నెలకు సరిగ్గా ఏడాది అవుతుంది. అలా ఏడాదిగా ఖాళీగా ఉన్న బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పినప్పటికీ దాని వివరాల్ని మాత్రం బయటకు వెల్లడించడం లేదు. టెక్నీషియన్స్, నటీనటుల ఎంపిక మొత్తాన్ని తెరవెనక పూర్తిచేస్తున్నారు కానీ, ప్రేక్షకులకు మాత్రం చెప్పడంలేదు.
ఎట్టకేలకు బన్నీ-త్రివిక్రమ్ మూవీకి సంబంధించి ఓ స్పష్టమైన ప్రకటన ఇవ్వబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈ శనివారం బన్నీ-త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ వివరాల్ని బయటపెట్టబోతున్నారు. అదేరోజు ఈ సినిమా హీరోయిన్ ను కూడా అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో బన్నీ-పూజాహెగ్డే కాంబోలో డీజే సినిమా వచ్చింది. అంతేకాదు, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత సినిమాలో కూడా పూజాహెగ్డే నటించింది. సుమారు 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో గీతాఆర్ట్స్, హారిక-హాసిని సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.
నిజానికి ఈ ప్రాజెక్టు కోసం ముందుగా ఓ రీమేక్ సబ్జెక్ట్ అనుకున్నారు. హిందీలో హిట్టయిన ఓ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ రైట్స్ దక్కించుకునే విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఓ కొత్త కథతో బన్నీ-త్రివిక్రమ్ సెట్స్ పైకి రాబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. సునీల్ ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు.