పవన్ కళ్యాణ్ ఓ ల్యాండ్ మైన్

ఆంధ్రలో పవన్ కళ్యాణ్ బలంగా పోరాడతున్నారని, యాంటీ వైకాపా ఓటు బ్యాంక్ చీలకూడదని అన్నంత వరకు బాగానే వుందని, కానీ ఆయనో ల్యాండ్ మైన్ అని, అది ఎవరి మీద పేలుతుందో తెలియడం లేదని…

ఆంధ్రలో పవన్ కళ్యాణ్ బలంగా పోరాడతున్నారని, యాంటీ వైకాపా ఓటు బ్యాంక్ చీలకూడదని అన్నంత వరకు బాగానే వుందని, కానీ ఆయనో ల్యాండ్ మైన్ అని, అది ఎవరి మీద పేలుతుందో తెలియడం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు. 

సక్రమంగా పేలితే మంచిదే అని అలా కాకపోతే రాష్ట్రంలో మళ్లీ వైకాపా వస్తుందనే భావనను నారాయణ వ్యక్తం చేసారు. సిపిఐ నేత నారాయణ తనకు తోచింది, బ్రేకుల్లేకుండా మాట్లాడే వ్యక్తి. ఓ ప్రెస్ మీట్ లో అనేక జాతీయ, ప్రాంతీయ విషయాల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

ఒక వైపు నమ్మకం పెట్టుకోలేని వైఖరితో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తుంటే, మరో వైపు యాంటీ భాజపా స్టాండ్ తీసుకోవడానికి తెలుగుదేశం జంకుతోందన్నారు. అలాంటపుడు రాజకీయ పరిష్కారం ఎలా సాధ్యం అన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీల్లో రాజకీయ స్పష్టత రావాల్సిన అవసరం వుందన్నారు.

చిరంజీవి చిల్లర బేరగాడు

అల్లూరి విగ్రహ ఆవిష్కరణ సభకు హీరో చిరంజీవిని పిలిచి, వేదిక మీద కూర్చో పెట్టుకోవడం పై కూడా నారాయణ ఘాటు విమర్శలు చేసారు. 

చిల్లర బేరగాడు, రాజకీయంగా రంగులు మార్చే వాడు అంటూ చిరంజీవిని ఆయన విమర్శించారు. హీరో కృష్ణను కాకుండా చిరంజీవిని కూర్చోపెట్టడం ఏమిటి అంటూ ఆయన ప్రశ్నించారు.

వెంకయ్య..గంగమ్మ..ఒకటేనా..?

గంగమ్మ జాతర జరిగినన్నాళ్లు బాగా అలంకరించి, పూజలు చేస్తారని, అంతా అయిపోయాక, ఊరి బయట పడేసి, ఇంక ఊళ్లోకి రామాక అని అంటారని చెప్పారు. వెంకయ్య విషయంలో భాజపా ఇలాగే వ్యవహరిస్తోందని నారాయణ ఎద్దేవా చేసారు.

వెంకయ్యకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వరని తమకు ముందే తెలుసు అని, ఎందుకంటే చురుగ్గా వున్నవారికి ఇవ్వరు కదా అని ఆయనే వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగించరు. ఉంచితే ఏ అంబాసిడర్ గానో, లేదంటే గవర్నర్ గానో (డిమోషన్ నా?)ఓ మూలన కూర్చో పెడతారని, నోరు లేని జీవం లాగా, ఓ అలంకార పూరితమైన పదవిలో వుంచుతారని,యాక్టివ్ పాలిటిక్స్ కు దూరం చేస్తారని నారాయణ జోస్యం చెప్పారు. రాజకీయపరంగా అంటరానివాడిగా వుంచేస్తారనన్నారు.

ఇదిలా వుంటే వెంకయ్య కూడా రాజ్యసభను సక్రమంగా నడిపించలేకపోయారని నారాయణ అన్నారు. కేంద్రంలో భాజపా పాలనపై నారాయణ పలు విమర్శలు చేసారు. ప్రతి పక్ష పార్టీలను భయభ్రాంతులను చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తున్నాయని అన్నారు. మోడీ హయాంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలై, తుక్కు తుక్కు అయిపోయిందన్నారు.