ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎమ్మెల్యే టికెట్‌ను అధికార పార్టీకి చెందిన నలుగురు నేతలు ఆశిస్తున్నారు. టికెట్ తమకంటే తమకని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఒక్కసారిగా అక్కడ వైసీపీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో తాడికొండలో రానున్న ఎన్నికల్లో ఎగిరే జెండా ఎవరిదనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర అసంతృప్తి ఉందని, అది తమకు టికెట్ దక్కేలా చేస్తుందనే ఆశ ఆ పార్టీలోని కొందరు నేతలు పెట్టుకున్నారు. తాడికొండ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ, అందుకు తగ్గట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న వారిలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మాజీ మంత్రి , ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టియానాతో పాటు సిటింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.
బాపట్ల ఎంపీగా నందిగం సురేష్‌పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యక్తమవుతోందనే ప్రచారం బలంగా ఉంది. మరోసారి అతనికి టికెట్ అనే అంశంపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జగన్‌తో సన్నిహితాన్ని అడ్డు పెట్టుకుని తాడికొండ టికెట్ దక్కించుకోవాలని నందిగం సురేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇక డొక్కా మాణిక్యవరప్రసాద్ విషయానికి వస్తే… 2004, 2009లలో అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్ తరపున గెలుపొందారు.
2009లో వైఎస్సార్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వైఎస్సార్ మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో ఆయన కొనసాగారు. మంత్రి పదవి రుచి చూసిన ఆయన, జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. అయితే ఎమ్మెల్సీలకు మంత్రి పదవి ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకోవడంతో ఆయన నిరాశలో ఉన్నారు. దీంతో ఆయన తాడికొండ టికెట్‌పై కన్నేశారు.
డొక్కాకు దివంగత ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ టీడీపీ కేడర్ అభిమానాన్ని చూరగొంటున్నారు. వైసీపీ కేడర్ కూడా తోడైతే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు. దీంతో తాడికొండ టికెట్ తనకు ఇస్తే తప్పక గెలుస్తాననే భరోసాను అధినాయకత్వానికి కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. దీంతో తాడికొండలో తనకంటూ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు.
తనకు తాడికొండ టికెట్ ఇస్తానని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటూ గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ హెనీ క్రిస్టియానా చెప్పుకుంటున్నారు. తాడికొండలో పర్యటిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సీఎం ఆదేశించారని ఆమె అంటున్నారు. ఇక సిటింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం మరోసారి టికెట్ తనకే అని ధీమాగా ఉన్నారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి తనకే జగన్ ఆశీస్సులు వుంటాయని ఆమె నమ్మకంగా ఉన్నారు. ఇలా నలుగురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు తాడికొండ టికెట్ కోసం ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.