అనుకున్న టైమ్ కంటే ముందే ఆదిపురుష్

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కొత్త షెడ్యూల్ ను గతంలో హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ముంబయిలో లాక్ డౌన్ పడ్డంతో, హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అదే టైమ్…

ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కొత్త షెడ్యూల్ ను గతంలో హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ముంబయిలో లాక్ డౌన్ పడ్డంతో, హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. కానీ అదే టైమ్ లో హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ పడింది. అలా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే కాస్త ముందే ప్రారంభం కాబోతోంది.

లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆదిపురుష్ సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్ కంటే ముందే ముంబయిలో మరో చిన్న షెడ్యూల్ మొదలుపెట్టాలని నిర్ణయించింది యూనిట్. దీనికి కారణం సైఫ్ అలీఖాన్.

ఆదిపురుష్ లో రావణాసురుడిగా కనిపించబోతున్నాడు సైఫ్. లెక్కప్రకారం ఈయన హైదరాబాద్ షెడ్యూల్ లో జాయిన్ అవ్వాలి. అయితే జూన్ 15 నుంచి షూటింగ్స్ మొదలుపెట్టుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, సైఫ్ కూడా వెంటనే కాల్షీట్లు అడ్జెస్ట్ చేయడంతో, అర్జెంట్ గా ముంబయిలో ఓ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు.

పూర్తిగా గ్రాఫిక్స్ తో రాబోతున్న ఆదిపురుష్ సినిమాకు లొకేషన్ తో పనిలేదు. గ్రాఫిక్స్ నిపుణుల సహాయంతో గ్రీన్ మ్యాట్ తో షూట్ చేస్తే సరిపోతుంది. అందుకే సైఫ్ కోసం అర్జెంట్ గా ముంబయిలోని స్టుడియోను రెడీ చేస్తున్నారు. ఆ వెంటనే ప్రభుత్వ నిర్ణయం బట్టి హైదరాబాద్ లో కూడా షెడ్యూల్ మొదలవుతుంది.

అయితే అటు ముంబయి షెడ్యూల్, ఇటు హైదరాబాద్ షెడ్యూల్ రెండింటికీ ప్రభాస్ అవసరం లేదు. ప్రభాస్ తో సంబంధం లేని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఈ గ్యాప్ లో సలార్ షెడ్యూల్ ముగించుకొని ఆదిపురుష్ సెట్స్ పైకి వస్తాడు ప్రభాస్.