ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించినట్టుగానే, దేశంలో మరో అతిపెద్ద రాష్ట్ర విభజనకు దారి తీస్తోంది. దీనికి రాజకీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్టు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి.
ప్రధాని మోదీతో యోగి ఆదిత్యనాథ్‌కు విభేదాలున్నట్టు గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటనపై రకరకాల ఊహాగానాలు వ్యాపించాయి. ప్రధానితో పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో యోగి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో సీఎం మార్పు, కేబినెట్ విస్తరణ…ఇలా పలు అంశాలు తెరపైకి వచ్చాయి. వీటి కంటే ప్రధాన అంశాలపై కేంద్ర పెద్దలతో ఆదిత్యనాథ్ చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలాగైనా మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.
ఈ పరంపరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్ర పెద్దలు సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై చర్చించేందుకు యోగి ఆదిత్యనాథ్‌ను ఢిల్లీకి పిలిపించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాన్ని రెండు లేదా మూడు ముక్కలుగా చేసైనా సరే అక్కడ పట్టు నిలుపుకునే యత్నంలో బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.
బీజేపీ, కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు గోరఖ్‌పూర్ సహా 23 నుంచి 25 జిల్లాలను పూర్వాంచల్ రాష్ట్రంగా ఏర్పాటు చేసే దిశగా మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. నూతనంగా ఏర్పాటయ్యే రాష్ట్రంలో 125 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేక పూర్వంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ చాలా కాలంగా ఉంది.
పూర్వంచల్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే యోగి ఆదిత్యనాథ్ కంచుకోటైన గోరఖ్‌పూర్ కొత్త రాష్ట్రంలోకి వస్తుంది. యోగి 1998 నుంచి 2017 వరకు ఐదు సార్లు గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మున్ముందు ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకోనున్నాయో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.