గత నెలలో కరోనాను కట్టడి చేసేందుకు జనతా కర్ఫ్యూకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశం యావత్తు చిత్తశుద్ధితో విజయవంతం చేసింది. అలాగే ఆ రోజు సాయంత్రం అందరూ చప్పట్లు కొట్టి వైద్య సిబ్బంది, పోలీసులను అభినందించారు. ఇంత వరకూ బాగానే ఉంది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి సేవలందించే పనిలో వాళ్లున్నారు కాబట్టి. కొందరు పోలీసుల పనితీరు విమర్శలకు దారి తీస్తోంది. అది వేరే విషయం.
ఆ తర్వాత మూడు రోజులకు మోడీ మళ్లీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ దఫా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. మళ్లీ జనం ఆయన మాటపై గౌరవంతో లాక్డౌన్లో ఇంటి నుంచి బయటికి రావడం లేదు. ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వాళ్లను పట్టించుకునే దిక్కు లేదు.
ఏదో మొక్కుబడిగా రేషన్‌కార్డు ఉన్న వాళ్లకి కాసిన్ని బియ్యాన్ని, ఇతర నిత్యావసర వస్తువులను అందచేస్తూ ప్రభుత్వాలు చేతులు దులుపు కుంటున్నాయి.
మోడీ మళ్లీ శుక్రవారం ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఈ ఆదివారం దేశ ప్రజలంతా కరోనాను తరిమి కొట్టే సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. 130 కోట్ల మంది తమ సమయాన్ని తనకివ్వాలని ఆయన కోరారు. సంకట సమయంలో 9 నిమిషాల పాటు తాను చెప్పినట్టు చేయడం వల్ల భారతీయులకు శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన నమ్మ పలికారు.
అసలు 9 నిమిషాల పాటు లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, దివ్వెలను వెలిగించడం వల్ల భారతీయులకు శక్తి, ఉత్సాహం ఎలా వస్తాయో బొత్తిగా అర్థం కావడం లేదు. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి జీవితాన్ని అంథకారం అలుముకుంటోంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లు నింపే దిశగా కరోనా పయనిస్తోంది.
తన కోసం సమయం ఇవ్వాలని మోడీ పదేపదే కోరుతూ…తొమ్మిది నిమిషాలు కొవ్వొత్తులు వెలిగించండి, లైట్లను ఆఫ్ చేయడం లాంటి మాటలు…ప్రజలను కేవలం మభ్య పెట్టేలా ఉన్నాయని ప్రతిపక్షాలతో పాటు ఇతరత్రా మానవ హక్కులు, ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ఏదైనా ప్రజలకు తిండి పెట్టే పనులు చేయడం మానేసి…మభ్య పెట్టే మాటలు చెప్పడం ఒక్క మోడీకే చెల్లుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ చెబుతున్న దాంట్లో సైంటిఫిక్ రీజన్ ఏముందో, లాజిక్ ఏంటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాలకుల మాటలు ప్రజల కడుపు నింపవు. ఇది మాటలతో మాయ చేసే తరుణం కాదు. చేతలకు పని చెప్పాల్సిన విలువైన సమయం.