ఎమ్బీయస్: కేసబ్లాంకా సినిమా కథ

కాస్సేపటికి ఉగార్తే నుంచి పత్రాలు కొనదలచిన జంట రిక్ క్లబ్‌కు వచ్చారు. ఆమె పేరు మిస్ ఇల్సా. అతనితో పాటు వచ్చినతనే విక్టర్. వాళ్లు ఉగార్తే గురించి ఎదురు చూస్తూండగానే రెనో, స్ట్రాసర్ అతన్ని…

కాస్సేపటికి ఉగార్తే నుంచి పత్రాలు కొనదలచిన జంట రిక్ క్లబ్‌కు వచ్చారు. ఆమె పేరు మిస్ ఇల్సా. అతనితో పాటు వచ్చినతనే విక్టర్. వాళ్లు ఉగార్తే గురించి ఎదురు చూస్తూండగానే రెనో, స్ట్రాసర్ అతన్ని గుర్తించి, దగ్గరకు వచ్చి మర్యాదగా మాట్లాడి, మర్నాడు పది గంటలకు పోలీసు స్టేషన్‌కు రమ్మనమని ఆదేశించారు. ఈలోగా ఫ్రాన్స్ ప్రతిఘటనోద్యమకారుడు ఒకతను విక్టర్‌ను పరిచయం చేసుకుని మర్నాడు రాత్రి జరగబోయే తమ సమావేశానికి ఆహ్వానించాడు. ఉగార్తేను పోలీసులు అరెస్టు చేశారని, అతని కోసం వెతకడం వృథా అని చెప్పాడు.

క్లబ్‌లో పియానో వాయిస్తున్న శామ్‌ను చూసి ఇల్సా ఉలిక్కిపడింది. ఈ క్లబ్ యజమాని ఎవరు అని రెనోని అడిగితే అతను ‘రిక్ అనే ఓ వింతమనిషి. నేనే ఆడదాన్ని అయితే అతన్ని ప్రేమిద్దును.’ అన్నాడు.

విక్టర్ విడిగా వెళ్లగానే ఇల్సా శామ్‌ను పిలిపించి పలకరించింది. ‘చాలా రోజులకు కలిశాం, రిక్ ఎక్కడ?’ అని అడిగింది. శామ్‌కు ఏదీ చెప్పడం యిష్టం లేదు. అతని మానాన అతన్ని వదిలేయ్ అన్నాడు. ‘‘పోనీ నాకు యిష్టమైన ‘ఏజ్ టైమ్ గోస్ బై’ పాట వాయిస్తూ పాడు’’ అంది. ‘నేను మర్చిపోయాను’ అన్నాడతను. కానీ ఆమె పట్టుబట్టడంతో పాడడం మొదలుపెట్టాడు. అది వినగానే పక్కగదిలో వున్న రిక్ విసురుగా బయటకు వచ్చి ‘ఈ క్లబ్‌లో ఆ పాట వాయించవద్దని నిషేధించాను కదా’ అని కోపంగా అన్నాడు. అంతలోనే ఇల్సాపై అతని చూపు పడింది. ఆమె అతని మాజీ ప్రేయసి. పారిస్‌లో వుండగా వాళ్లిద్దరూ ఆ పాటను శామ్ చేత పాడించుకునేవారు.

ఏమనాలో తెలియక నిల్చున్నపుడు రెనో విక్టర్‌ను తీసుకుని వచ్చి రిక్‌కు పరిచయం చేశాడు. రిక్ విక్టర్‌ను గౌరవిస్తూ మాట్లాడాడు. కస్టమర్లతో కలిసి తాగకూడదనే తన నియమానికి విరుద్ధంగా, ఆ జంటతో కూర్చుని మద్యం సేవిస్తూ, ఇల్సా తనకు ముందే తెలుసని చెప్పాడు. బిల్లు కూడా యివ్వనక్కరలేదన్నాడు. రెనోకు యిదంతా ఆశ్చర్యంగా వుంది. ఇల్సాకు, రిక్‌కు మధ్య గాఢస్నేహం వుందని అతనికి తోచింది. క్లబ్ మూసేసే వేళయింది. రెనో, విక్టర్, ఇల్సా వెళ్లిపోయారు. రిక్ తాగుతూ కూర్చున్నాడు. శామ్ వచ్చి అనునయించబోయాడు. కానీ రిక్ బాధ తగ్గలేదు. తమ కిష్టమైన ‘ఏజ్ టైమ్ గోస్ బై’ వాయించమని అడిగాడు. శామ్ వాయిస్తూ వుండగా అతనికి గతం గుర్తుకు వచ్చింది.

పారిస్‌లో వుండగా రిక్‌, ఇల్సా ప్రేమించుకున్నారు. ఒకరి గతం గురించి మరొకరు అడగకూడదని అనుకునే కలిసి తిరిగారు. ఓ రోజు ఆమె ఓ విషయం చెప్పింది – గతంలో నా జీవితంలో ఒకతను వుండేవాడు, కానీ చచ్చిపోయాడు అని. పారిస్‌లోకి జర్మన్లు ప్రవేశించడంతో ఇల్సాకు భయం వేసింది. స్పెయిన్‌లో, ఇథియోపియాలో నువ్వు అక్షరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడావు కాబట్టి నీ మీద ఏదో ఒక కేసు పెట్టి జైల్లోకి తోస్తారు. మనం పారిపోదాం అంది. వాళ్లిద్దరూ రైలెక్కి మార్సేల్స్‌కు వెళ్లిపోయి అక్కడే పెళ్లి చేసుకుందా మనుకున్నారు. వీళ్లతో బాటు వీళ్లిద్దరికీ స్నేహితుడైన శామ్ కూడా వస్తానన్నాడు. మర్నాడు రైల్వే స్టేషన్‌లో రిక్ వేచి వుండగా ఇల్సా రాలేదు. ఆమె నివాసముండే హోటల్‌కు శామ్ వెళితే రిసెప్షన్‌లో ఒక ఉత్తరం వుంది. ‘కారణాలు చెప్పలేను, నేను నీతో రాలేను. జీవితంలో మళ్లీ నిన్ను చూడలేను. కానీ నిన్ను ప్రేమిస్తూనే వుంటానని మాత్రం తెలుసుకో.’ అని ఇల్సా స్వహస్తాలతో రాసింది.

అది చదివి రిక్ మనసు వికలమై పోయింది. యావత్తు మానవజాతి మీదే రోత పుట్టింది. కానీ తను పారిస్‌లోనే వుండి ఆమె కోసం వెతికే పరిస్థితి లేదు. జర్మన్లు అప్పటికే దగ్గర్లో వున్నారు. పారిస్ నుంచి వెళ్లే ఆఖరి రైలు యిదే! ఇక ఏమీ చేయలేక కేసబ్లాంకా వచ్చి భగ్నహృదయంతో మనసు రాయి చేసుకుని తన వ్యాపారం చూసుకుంటున్నాడు. 18 నెలల తర్వాత లోకంలో వేరే ఏ క్లబ్బూ లేనట్లు యిక్కడికే వచ్చి పాతగాయాలను రేపిందే అని రిక్ బాధ! తను వచ్చి సంజాయిషీగా ఏదో కాకమ్మ కథ చెప్తుందని ఎదురు చూస్తూ, చిత్తుగా తాగుతూ తిక్కతిక్కగా వున్నాడు. కాస్సేపటికి అనుకున్నట్లే ఇల్సా వచ్చింది. ‘రా, రా, ఏదో కథ చెప్తావని తెలుసులే’ అంటూ వెక్కిరించాడు.

అతను రోషంతో ఉన్నాడని, మత్తులో మునిగివున్నాడనీ తెలిసే జంకుజంకుగా ఇల్సా చెప్పబోయింది – ‘నువ్వు యిక్కడున్నావని తెలిస్తే రాకే పోదును. ఓ కథ చెప్తాను విను, ఒకమ్మాయి నార్వేలోని ఓస్లో నుంచి పారిస్‌కు వచ్చింది. కొందరు స్నేహితుల ద్వారా ఆమెకు ఒక సాహసి పరిచయమయ్యాడు. అతని గురించి ఆమె ముందే విని వుంది. అతన్ని మూగగా ఆరాధించింది. దాన్నే ప్రేమ అనుకుంది…’ అని యింకా చెపుతూండగానే రిక్ హేళనగా ‘ఔనౌను, యిలాటి కథలు చాలా విన్నాను. అప్పుడు నేపథ్యంలో పియానో మోగింది…’ అంటూ మాట్లాడడంతో తనేం చెప్పినా అతను వినే మూడ్‌లో లేడని, తను చేసిన విశ్వాసఘాతుకత్వంతో అతని మనసు విరిగిపోయిందని, తనను క్షమించే ప్రశ్నే లేదని అర్థమై పోయింది. ఈ వ్యర్థప్రయత్నం మాని ఆమె లేచి వెళ్లిపోయింది.

2వ రోజు –

ఉదయం విక్టర్, ఇల్సా పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్ట్రాసర్‌ను, రెనోను కలిశారు. ‘నువ్వు కాన్సన్‌ట్రేషన్ క్యాంపునుంచి పారిపోయావు. కావాలంటే నిన్ను ఆరెస్టు చేయించగలను. నువ్వు అన్ని దేశాలలో వున్న కుట్రదారుల పేర్లూ చెపితే నీకు వీసా యిచ్చి అమెరికాకు పంపుతాను.’ అంటా స్ట్రాసర్ ఆఫర్ యిచ్చాడు. ‘నేను ఎవరిపేరూ చెప్పను. సాంకేతికంగా చూస్తే యిక్కడ మీ పాలన లేదు. ఇక్కడ నేను ఏ నేరమూ చేయనంతకాలం ఫ్రెంచి పోలీసులు నన్ను అరెస్టు చేయలేరు.’ అన్నాడు విక్టర్ తొణక్కుండా. అప్పుడు రెనో ‘నువ్వు ఉగార్తో గురించి వెతుకుతున్నావు లాగుంది. పోలీసు కస్టడీలో వుండగా అతను చచ్చిపోయాడు. దొంగ వీసా పత్రాలతో నువ్వు పట్టుబడ్డావో అరెస్టు చేయడం ఖాయం.’ అని హెచ్చరించి పంపేశాడు.

అప్పుడు విక్టర్, ఇల్సా బ్లాక్‌మార్కెట్‌లో వీసాలు ఏమైనా దొరుకుతాయేమో కనుక్కోవడానికి ఆ వ్యాపారంలో దిట్ట యైన ఫెరారీ వద్దకు వెళ్లాడు. వీళ్లు వెళ్లే ముందే రిక్ అక్కడకు వెళ్లాడు. ‘ఉగార్తే తన దగ్గరున్న పత్రాలు నీకిచ్చాడేమోనని నా అనుమానం. అవి నాకిస్తే మంచి ధరకు అమ్మిపెడతాను. నాకు కాస్త కమిషన్ యిస్తే చాలు.’ అని బేరం పెట్టాడు. ‘నా దగ్గరేమీ లేవు’ అని బయటకు వచ్చేసిన రిక్‌కు మార్కెట్లో ఇల్సా ఒంటరిగా కనబడింది. దగ్గరకు వెళ్లి ‘నిన్న రాత్రి ఏదో చెప్పబోయావ్, తాగుడు మత్తులో నాకేమీ అర్థం కాలేదు. ఇప్పుడు మామూలుగా వున్నాను. చెప్పు, వింటాను.’ అన్నాడు.

ఆమె ‘నాకు పారిస్‌లో పరిచయమున్న రిక్ అయితే చెప్పి వుండేదాన్ని. నిన్న రాత్రి నీ కళ్లలో అసహ్యం కనబడింది. నేను త్వరలోనే యీ వూరు విడిచి వెళ్లిపోతాను. నా జ్ఞాపకాల్లో పాత రిక్‌నే పదిలపరుచుకుంటాను. నీతో నేను మాట్లాడవలసినది ఏమీ లేదు.’ అంది. ‘నాకు తెలుసు, నాతో బాటు వస్తే జర్మన్ల నుంచి అనుక్షణం పారిపోతూండాల్సి వస్తుందని నీ భయం. అందుకే చివరి నిమిషంలో మనసు మార్చుకున్నావ్. నేను యిప్పుడు ఎక్కడికీ పారిపోవటం లేదు. ఇక్కడే సెటిల్ అయ్యాను. ఎప్పుడైనా నాతో మాట్లాడాలని అనిపిస్తే నా క్లబ్‌లో పై గదిలోనే వుంటాను. అక్కడకి రా.’ అని రిక్ చెప్పాడు. ఆమె తల తిప్పేసుకుంది. ‘విక్టర్‌కు చెప్పకుండా రా’ అని రొక్కించాడు రిక్. ‘లేదు, విక్టర్ నా భర్త. ఇప్పుడే కాదు, పారిస్‌లో మనం కలిసి తిరిగిన రోజుల్లో కూడా అతను నా భర్తే.’ అనేసి ఆమె వెళ్లిపోయింది. ఆ మాట విని రిక్ నిర్ఘాంతపోయాడు.

ఇల్సా ఫెరారీ క్లబ్బుకి వెళ్లేసరికి అప్పటికే విక్టర్ అతనితో మాట్లాడివున్నాడు. ఈమె రాగానే ‘రెండు వీసాలు దొరకడం కష్టం, ముఖ్యంగా నాకు దొరకడం కష్టం కాబట్టి, నీకైతే ఒకటి సంపాదించగలనేమో చూస్తానంటున్నాడు. నువ్వు ముందుగా అమెరికాకు వెళ్లిపో. నీ తర్వాత నేను వీలు చూసుకుని వస్తాను.’ అన్నాడు. ఇల్సా అదేమీ కుదరదు, వెళితే యిద్దరం కలిసే వెళదామంది. వీళ్ల అవస్థ చూసి ఫెరారీ ‘ఉగార్తే దగ్గర పత్రాలు దొరకలేదు. రిక్‌కు యిచ్చాడేమోనని నా అనుమానం. కానీ రిక్ ఓ తిక్కమనిషి. అడిగిచూడండి.’ అని సలహా యిచ్చాడు.

విక్టర్, ఇల్సా రిక్‌ క్లబ్బుకి వెళ్లారు. పైన ఆఫీసు గదిలో విక్టర్ రిక్‌ను విడిగా కలిసి ‘నేను ఉద్యమం నడపాలంటే అమెరికాకు వెళ్లడం అత్యావశ్యకం. నువ్వు గతంలో నాజీలకు, ఫాసిస్టులకు వ్యతిరేకంగా పోరాడావు కదా, నాకు సాయం చెయ్యి’ అని అడిగాడు. ‘నేను రాజకీయాలు వదిలేశాను. ఇప్పుడు కేవలం బిజినెస్‌మన్‌నే.’ అని చెప్పాడు రిక్. నిజంగా అంతకు కాస్సేపటి క్రితమే అతను బల్గేరియా నుంచి వచ్చిన ఒక జంటకు అడక్కుండానే సాయం చేసి వున్నాడు. ఆ జంటలో భార్య వీసాల కోసం రెనో వద్దకు వెళితే ‘డబ్బయినా ఇయ్యి, లేకపోతే నాతో పడుక్కో’ అన్నాడు రెనో. భర్త డబ్బు కోసం జూదమాడాడు కానీ డబ్బు పోతోంది. ఆమె వచ్చి రిక్‌తో చెపితే అతను కావాలని ట్రిక్కు చేసి భర్తకు డబ్బు వచ్చేట్లు చేశాడు. ఇదంతా గమనించిన రెనో ‘నువ్వు సెంటిమెంటలిస్టువని మళ్లీ రుజువైంది. నాకు ఆ అమ్మాయిని దక్కకుండా చేశావ్. అయినా యీసారికి క్షమిస్తున్నాను.’ అన్నాడు.

ఇప్పుడు విక్టర్ ‘నువ్వు బిజినెస్‌మన్‌వే అయితే మూడు లక్షల ఫ్రాంకులు తీసుకుని, నాకు పత్రాలు ఏర్పాటు చేయి.’ అన్నాడు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ అది చెయ్యను, కారణమేమిటో మీ ఆవిణ్ని అడుగు’ అని రిక్ దురుసుగా సమాధానమిచ్చాడు. ఇంతలో కింద క్లబ్బులో మేజర్ స్ట్రాసర్ సారథ్యంలో నాజీ ఆఫీసర్లు క్లబ్బులో ప్రవేశించి జర్మన్ దేశభక్తి గీతం వాయించమని శామ్‌ను ఆదేశించాడు. ఒళ్లుమండిన విక్టర్ తక్కిన వాద్యబృందాన్ని ఫ్రెంచ్ జాతీయగీతాన్ని ఆలపించమన్నాడు. రిక్ అనుమతితో వాళ్లు వాయించారు. పాట మొదలవడంతో అప్పటిదాకా భయంతో అణుచుకున్న దేశభక్తి పొంగి పొరలగా క్లబ్బులో ఫ్రెంచివారందరూ ఆ గీతాన్ని పాడారు. అసహనంతో మండిపడిన స్ట్రాసర్ రెనోతో ‘ఈ క్లబ్బుని మూయించేయ్.’ అన్నాడు. రెనో వెంటనే మూసేయండి అని ఆదేశించాడు. రిక్ వచ్చి ఎందుకు? అని అడిగితే ‘ఇక్కడ జూదమాడుతున్నారని తెలిసింది.’ అని జవాబిచ్చాడు.

స్ట్రాసర్ ఇల్సా దగ్గరకు వచ్చి ‘విక్టర్ యిక్కడ వున్న కాస్సేపట్లో ఎంత కల్లోలం సృష్టించాడో చూశావా? మీరు వెంటనే వెనక్కి మా అధీనంలో వున్న ఆక్రమిత ఫ్రాన్స్‌లోకి వెళ్లిపోండి. లేదా యిక్కడే ఎవరో ఒకరు చాటుగా చంపేస్తారు జాగ్రత్త.’ అని హెచ్చరించాడు. ఆ రాత్రి విక్టర్ తన సహచరుల రహస్యసమావేశానికి వెళ్లడానికి తయారవుతూంటే ఇల్సా పత్రాల గురించి అడిగింది. ‘రిక్ యివ్వనన్నాడు. కారణం అడిగితే నీ భార్య నడగమన్నాడు.’ అని విక్టర్ చెప్పాడు. నేను కాన్సన్‌ట్రేషన్ కాంపులో వున్నపుడు పారిస్‌లో మీ యిద్దరి మధ్య ఏమైనా జరిగిందాని స్పష్టంగా అడగలేదు కానీ జరిగినా నేనర్థం చేసుకోగలను అనే ధోరణిలో మాట్లాడాడు. ఇల్సా అతనికేమీ చెప్పలేదు కానీ అతను బయటకు వెళ్లగానే తను రిక్ క్లబ్‌కు బయలుదేరింది.

క్లబ్బు మూసేసినందుకు రిక్ ఏమీ చింతించలేదు. లంచం యిస్తే చాలు రెండు, మూడు వారాల్లో మళ్లీ తెరవవచ్చని అతని ధీమా. పనులు ముగించుకుని పైన తన రూముకి వచ్చేసరికి అక్కడకి వెనుక మెట్ల ద్వారా చేరి, వేచి వున్న ఇల్సా కనబడింది. ‘పత్రాలకోసం వచ్చావా? ఇవ్వనని మీ ఆయన చెప్పలేదా? అతని ప్రాణాలకు ఎంత విలువుందో లెక్చరివ్వడానికి వచ్చావా?’ అని విసుక్కున్నాడు. ‘నీ స్వభావం యిది కాదు. నేను మోసం చేశానన్న బాధతో లోకాన్నే అసహ్యించుకునే స్థితికి వచ్చావు. నీకు నిజం తెలిస్తే యిలా మాట్లాడవు.’ అంది ఇల్సా. ‘నీకు ప్రస్తుతం పత్రాలు కావాలి కాబట్టి ఏదైనా చెప్పగలవు. నీ మాట నేనెందుకు నమ్మాలి?’ అన్నాడతను విసురుగా. ‘నీ మాట ఎలా వున్నా, మాకు ఆ పత్రాలు చాలా అవసరం.’ అంటూ రివాల్వర్ చూపించిందామె. ‘నీ భర్త ప్రాణం కోసం యితరుల ప్రాణాలు తీయడానికి సిద్ధపడ్డావా? మంచిదే, నీకు సహాయపడతాను.’ అంటూ అతను దగ్గరగా వెళ్లి తుపాకీకి ఎదురుగా నిలబడ్డాడు.

‘ఆ పని చేయలేను, నేను నిన్నింకా ప్రేమిస్తున్నాను’ అని ఏడుస్తూ అతని చేతుల్లో వాలిపోయింది ఇల్సా. ఆమెను గాఢంగా చుంబించాడతను. నిజానికి ఆమె అతన్ని కావాలని మోసం చేయలేదు. విక్టర్‌ను చూసి ముచ్చటపడి పెళ్లాడిన తర్వాత అతను చెక్ వెళ్లవలసి వచ్చింది. జర్మన్ గెస్టపో (హెర్మన్ గోరింగ్ నేతృత్వంలో పని చేసిన జర్మన్ రహస్య పోలీసుదళం) అతను రాగానే పట్టుకుని కాన్స్‌న్ట్రేషన్ కాంప్‌కు పంపింది. తర్వాత కొన్ని నెలలకు అతను పారిపోతూ వుండగా కాల్చి చంపేరనే వార్త వచ్చింది. ఆమె ఒంటరిదై పోయింది. ఆ సమయంలోనే రిక్ పరిచయమయ్యాడు. పెళ్లి కాగానే విక్టర్ ఆమెకు చెప్పాడు ‘నాతో పెళ్లయినట్లు ఎవరికీ చెప్పవద్దు. చెపితే నీకూ, నీకు సంబంధించిన వారందరికీ డేంజర్. నేను దొరక్కపోతే నా ఆచూకీ కోసం వాళ్లు మీ అందర్నీ హింసిస్తారు. ’ అని. అతని సన్నిహిత మిత్రులకు కూడా చెప్పలేదు. ఇప్పటికీ ఆమెను ‘మిస్’ అనే వ్యవహరిస్తున్నాడు. అందుకే ఆమె తనకు ఫలానావారితో పెళ్లయిందని రిక్‌తో చెప్పలేదు.

రిక్‌తో పారిస్ విడిచి వెళ్లాలని అనుకున్నపుడే ఒక స్నేహితుడు వచ్చి విక్టర్ బతికేవున్నాడని, కానీ చాలా జబ్బు పడి వున్నాడని, పారిస్ శివార్లలో ఒక చోట రహస్యంగా దాక్కుని, తన కోసం చూస్తున్నాడనీ చెప్పాడు. ఈ విషయం రిక్‌కు చెపితే అతను తన కోసం పారిస్‌లోనే వుండిపోతాడని, గెస్టపో వాళ్లు తనను అనుసరిస్తూ, రిక్‌ను కూడా అదుపులో తీసుకునే ప్రమాదం వుందని భయపడింది. రిక్ క్షేమంగా వుండాలంటే తను అతని జీవితంలోంచి తప్పుకోవాల్సిందే అనుకుంది. వెళ్లి భర్తకు సేవలు చేసింది. అతను బతికాడు.

ఈ విషయాలన్నీ విపులంగా తెలియడంతో రిక్ నిట్టూర్చాడు. ఇద్దరి మధ్య పాతకాలపు ప్రేమ తొంగి చూసింది. ఆమె కోసం, ఆమె భర్త కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడతను. ఇప్పుడేం చేద్దాం? అని అడిగితే ఇల్సా ‘విక్టర్‌ ఆశయం రాజకీయాలు. నాకున్న ఆశయం నీతో కలిసి బతకడం. నేను పరుగులు పెట్టి అలిసిపోయాను. అతను వెళ్లిపోయే ఏర్పాటు చేయి చాలు. నిన్ను నేను మళ్లీ వదులుకోను.’ అంటూ హత్తుకుపోయింది.

విక్టర్ తన సాటి తిరుగుబాటుదారులతో కలిసి పాల్గొన్న సమావేశంపై పోలీసుల దాడి జరగడంతో అతను కొద్దిపాటి గాయంతో తప్పించుకుని అదే సమావేశంలో పాల్గొన్న రిక్ ఉద్యోగితో సహా పారిపోయి క్లబ్‌కు వచ్చాడు. వాళ్లను చూసిన రిక్, ఇల్సాకు తన ఉద్యోగిని తోడిచ్చి బయటకు పంపేశాడు. విక్టర్ రిక్‌తో ‘నాకు పత్రాలివ్వకపోయినా ఫర్వాలేదు. నువ్వు ఇల్సాను ప్రేమిస్తున్నావు కాబట్టి, కనీసం ఆమెకు యిచ్చి క్షేమంగా దేశం దాటించు.’ అని కోరాడు. అంతలోనే పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుని పోయారు.

3 వ రోజు –

రిక్ రెనో వద్దకు వెళ్లాడు. ‘నువ్వు విక్టర్‌ను విడిచిపెడితే జర్మన్ కొరియర్లను చంపి వాళ్ల పత్రాలు కొట్టేశాడన్న పెద్ద నేరం మీద అరెస్టయ్యేందుకు, తద్వారా అతన్ని కాన్స్‌న్ట్రేషన్ కాంప్‌కు పంపి, జర్మన్ల మెప్పు పొందేందుకు సహకరిస్తాను.’ అని ఊరించాడు. ‘నీకేమిటి లాభం?’ అని రెనో అడిగాడు అనుమానంగా. ‘అతన్ని జైల్లోకి నెట్టేసి, ఆ పత్రాలతో నేనూ, ఇల్సా అమెరికాకు పారిపోతాం.’ అని చెప్పాడు రిక్. ‘ఇది నాకు చెప్పవలసిన అవసరమేముంది?’ అన్నాడు రెనో. ‘ఇల్సాకు విక్టర్ రహస్యాలు తెలుసునని స్ట్రాసర్‌కి అనుమానముంది. అతను లొంగటం లేదు కాబట్టి, ఆమెను హింసించైనా అవి బెల్లిద్దామని చూస్తున్నాడు. మేం పారిపోతూ వుంటే అడ్డుపడవచ్చు. పడకుండా చూడాల్సిన బాధ్యత నీది.’ అన్నాడు రిక్. ‘నువ్వు విక్టర్‌ను ప్రస్తుతానికి వదిలేయ్. విమానం బయలుదేరేందుకు ఒక అరగంట ముందు మా క్లబ్‌కు రా. అక్కడకు విక్టర్‌ను రప్పిస్తాను. పత్రాలతో సహా అతన్ని అరెస్టు చేసేయ్. మేమిద్దరం అమెరికా వెళ్లిపోతాం.’ అన్నాడు. రెనో సరేనన్నాడు.

అక్కణ్నుంచి రిక్ ఫెరారో దగ్గరకు వెళ్లి క్లబ్ ‌అమ్మేశాడు. శామ్‌కు లాభాల్లో నాల్గవవంతు యివ్వాలని, ముగ్గురు ఉద్యోగులను కొనసాగించాలని షరతులు పెట్టాడు. ఆ తర్వాత క్లబ్‌కు వచ్చి కూర్చున్నాడు. ఆ రాత్రి విక్టర్ వచ్చేందుకు కాస్త ముందుగా రెనో వచ్చి చాటుగా దాక్కున్నాడు. విక్టర్‌తో కలిసి వచ్చాక ఇల్సా విడిగా రిక్‌ని కలిసి ‘‘తనతో బాటు నేనూ వస్తున్నానని అనుకుంటున్నాడు విక్టర్. నువ్వు చెప్పలేదా?’’ అని అడిగింది. ‘‘చివరి నిమిషంలో చెపితే తర్జనభర్జనలు తగ్గుతాయని..’ అన్నాడు రిక్. విక్టర్ డబ్బివ్వబోతే రిక్ అక్కరలేదు అంటూ పత్రాలు చేతిలో పెట్టాడు. మరుక్షణమే రెనో బయటకు వచ్చి ‘జర్మన్ కొరియర్లను చంపిన హత్యానేరంపై నిన్ను అరెస్టు చేస్తున్నాను.’ అన్నాడు. రిక్ దగా చేశాడే అని విక్టర్, ఇల్సా అనుకుంటూండగానే రిక్, రెనో గుండెకు తుపాకీ గురిపెట్టి ‘ఎయిర్‌పోర్టుకి ఫోన్ చేసి ‘పత్రాలతో ఇద్దరు వస్తారు. లిస్బన్ వెళతారు. వాళ్లకు అడ్డు తగలకండి’ అని చెప్పించాడు.

తర్వాత అతన్ని బెదిరిస్తూనే ఎయిర్‌పోర్టుకి వెంటపెట్టుకుని వెళ్లాడు. విక్టర్ వెళ్లి విమానంలో లగేజి పెట్టించే టైములో రిక్ రెనోతో పత్రాలపై మిస్టర్ అండ్ మిసెస్ విక్టర్ అని రాయించాడు. ఇల్సా ఆశ్చర్యపడింది, అభ్యంతర పెట్టింది. ‘విక్టర్ పారిపోయి, నువ్వు వుండిపోతే స్ట్రాసర్ నిన్నూ, నీతో పాటు నన్నూ కాన్సన్ట్రేషన్ కాంప్‌కు పంపుతాడు. పైగా నువ్వు నీ భర్తకే చెందుతావని నీకూ తెలుసు, నాకూ తెలుసు. ఇక్కడే వుండిపోతే నువ్వు చింతిస్తావు, ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ అతి త్వరలోనే అపరాధభావన కలిగి జీవితాంతం దుఃఖిస్తావు.’ అన్నాడు.

‘మరి మన ప్రేమ సంగతేమిటి?’ అని అడిగిందామె. ‘మన పారిస్ రోజులు నిన్న రాత్రి తిరిగి వచ్చేశాయి (వారిద్దరి మధ్య శృంగారం జరిగిందని మనం వూహించుకోవాలి). ఆ జ్ఞాపకాలు చాలు.’ అని రిక్ నచ్చచెప్పి ఆమెను పంపించి వేశాడు. విక్టర్ తిరిగి రాగానే ‘నీకో విషయం చెప్పాలి. నిన్న రాత్రి నీ భార్య నా గదికి వచ్చి పత్రాలడిగింది. నిన్ను రక్షించడానికై నన్నింకా ప్రేమిస్తున్నానంటూ ఏవేవో కబుర్లు చెప్పింది. మా యిద్దరి మధ్య కథ ముగిసిపోయిందని నాకు తెలుసు కానీ ఆమె మాటలు నమ్మినట్లు నటించాను.’ అని చెప్పాడు. విక్టర్ సంతోషపడ్డాడు. ‘పోరాటంలో విజయం సాధిద్దాం. చేసిన సహాయానికి థాంక్స్.’ అని చెప్పి విమానం ఎక్కేశాడు.

రెనో రిక్‌కు మాటిచ్చాడు కానీ చాటుగా స్ట్రాసర్‌కు సమాచార మిచ్చాడు – ఇల్సాను పారిపోనిచ్చాడని తర్వాత తనకు మాట రాకూడదని. విమానం సరిగ్గా కదిలే సమయానికి స్ట్రాసర్ ఎయిర్‌పోర్టుకి వచ్చి అడ్డుకోబోయాడు. కంట్రోల్ టవర్‌కు ఫోన్ చేసి, విమానాన్ని ఆపేయబోయాడు. రిక్ తుపాకీ చూపించి ఫోన్ చేయవద్దని చెపుతూంటే అతన్ని కాల్చాడు. అతని గురి తప్పింది కానీ, రిక్ గురి తప్పలేదు. స్ట్రాసర్ కుప్పకూలాడు. అంతలో పోలీసులు వచ్చి దిగారు. రెనో రిక్ కేసి దీర్ఘంగా చూశాడు. మాజీ ప్రేయసి కోసం రిక్ చేసిన సాహసాన్ని, త్యాగాన్ని చూసి ముగ్ధుడైన రెనోకు హఠాత్తుగా మనసు మారింది. అప్పటికప్పుడు జర్మన్లకు వ్యతిరేకంగా ప్రతిఘటనోద్యమంలో చేరదామని నిశ్చయించుకున్నాడు. అందువలన తన సిబ్బంది రిక్‌ను అరెస్టు చేయకుండా అడ్డుపడి ‘స్ట్రాసర్ హత్య విషయంలో మామూలు అనుమానితుల నెవరినైనా అదుపులోకి తీసుకోండి’ అని చెప్పి పంపించేశాడు.

రిక్ దగ్గరకు వచ్చి ‘నువ్వు సెంటిమెంటలిస్టువే అనుకున్నాను. దేశభక్తుడివి కూడా అని తేలింది ఇవాళ. కాసబ్లాంకా వదిలి మనిద్దరం ఆఫ్రికాలో వున్న మరో ఫ్రెంచి కాలనీ బ్రాజవిల్‌కు పారిపోయి అక్కణ్నుంచి నాజీలను ప్రతిఘటిద్దాం. ముందు నువ్వు వెళ్లు. వెనక్కాలే నేను వస్తాను.’ అన్నాడు. ‘మన మధురస్నేహం కొత్తగా పరిమళించబోతోంది.’ అంటాడు రిక్ అతనితో నవ్వుతూ. ఫ్రెంచి జాతీయగీతం నేపథ్యంలో వినబడుతూండగా సినిమా ముగుస్తుంది.

ఈ కథంతా చదివాక నేను మరీ నాసిగా రాస్తే తప్ప మీరు తప్పకుండా సినిమా చూస్తారని అనుకుంటున్నాను. చూశాక ఆ నటీనటుల గురించి కాస్తయినా తెలుసుకోవాలని అనుకోవచ్చు. వాళ్లు మీకు వేరే సినిమాల్లో కూడా తారసిల్లవచ్చు. అందుకే అది కూడా జోడిస్తున్నాను. తక్కినవాళ్ల మాట ఎలా వున్నా, యీ సినిమా హీరోహీరోయిన్ల ప్రేమ కథలు సినిమా కథలకు తీసిపోవు. అందుకని వచ్చే వ్యాసంలో వారి గురించి చెప్తాను. (ఫోటో- పై వరుసలో రిక్ పాత్రధారి హంఫ్రీ బోగార్ట్, ఇల్సా పాత్రధారిణి ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మన్, విక్టర్ పాత్రధారి పాల్ హెన్‌రీడ్.. క్రింది వరుసలో శామ్ పాత్రధారి డూలీ విల్సన్, రెనో పాత్రధారి క్లాడ్ రెయిన్స్, స్ట్రాసర్ పాత్రధారి కాన్రాడ్ వెయిడ్‌ట్) (సశేషం) 

– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2021)

[email protected]