సాగర్ లో , తిరుపతిలో వింతలు…!

తెలంగాణలో నాగార్జున సాగర్, ఆంధ్రాలో తిరుపతి లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించేశారు. దీంతో ఆంధ్రాలో ప్రతిపక్షాలలో, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో, బీజేపీలోనూ టెంక్షన్ మొదలైంది. సాగర్ ఉప ఎన్నిక…

తెలంగాణలో నాగార్జున సాగర్, ఆంధ్రాలో తిరుపతి లోక్ సభ స్థానాల ఉప ఎన్నికలకు తేదీ ప్రకటించేశారు. దీంతో ఆంధ్రాలో ప్రతిపక్షాలలో, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో, బీజేపీలోనూ టెంక్షన్ మొదలైంది. సాగర్ ఉప ఎన్నిక కోసం జానారెడ్డిని నిర్ణయించి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ ఆరాంగా ఉంది. అంటే ఊపిరి పీల్చుకుందన్నమాట. 

ఇక టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థుల కోసం వేటాడటమే సరిపోయింది. మామూలుగా అయితే ఇలాంటి విషయాల్లో కేసీఆర్ స్పీడుగా ఉంటారు. అందరికంటే ముందే కర్చీఫ్ వేసేస్తారు. కానీ దుబ్బాకలో, జిహెచ్ఎంసీలో బీజేపీ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగిపోయింది కాబట్టి కేసీఆర్ తొందరపడటం లేదు. 

ఇక బీజేపీ దుబ్బాక తరువాత సాగర్ ను కూడా కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అల్లాటప్పాగా అభ్యర్థిని ఎంపిక చేయాలనుకోవడంలేదు. రెండు పార్టీలు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో ఎవరూ అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. 

ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కుల సమీకరణాలే కీలకం. అందుకని బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందోనని టీఆర్‌ఎస్‌ ఎదురు చూస్తోంది. సేమ్ ..బీజేపీది కూడా ఇదే ఆలోచన. చనిపోయిన నోముల నరసింహయ్య కుటుంబం నుంచి ఎంపిక చేద్దామంటే దుబ్బాకలో సీన్ రిపీట్ అవుతుందేమోనని అధికార పార్టీకి భయం. రాబోయే పదిరోజుల్లో అభ్యర్థులను ఎంపిక చేయక తప్పదు. 

ఇక ఆంధ్రా విషయానికి వస్తే మునిసిపల్ ఎన్నికల్లో సృష్టించిన సునామీలో టీడీపీ, బీజేపీ నామరూపాలు లేకుండా పోయాయి. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు ముందుగా అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ. తన అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఎప్పుడో డిసైడ్ చేసింది. 

వైసీపీ తన అభ్యర్థిగా జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్టు గురుమూర్తిని ఇదివరకే డిసైడ్ చేసినా ఇప్పుడు జగన్ అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థిని ప్రకటించాల్సింది బీజేపీ మాత్రమే అని జనం అనుకుంటున్నారు. కానీ టీడీపీకి మరో తలనొప్పి తగులుకునేలా ఉంది. 

టీడీపీ పనబాక పేరును ఎప్పుడో ప్రకటించినప్పటికీ ఆమె ఇప్పటివరకు ఏమాత్రం స్పందించలేదు. ఒకవిధంగా ఆమె పతా లేకుండా పోయింది. తాను తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆమె మర్చిపోయిందని తమ్ముళ్లు అంటున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయంతో తిరుపతిలో  గెలుపు సాధ్యం కాదని పనబాక భావిస్తున్నట్లు సమాచారం.

ఓడిపోయేచోట పోటీ చేయడం ఎందుకని ఆమె అనుకుంటే మాత్రం టీడీపీ మరో అభ్యర్థిని వెతుక్కోవలసి వస్తుంది. పది రోజుల్లో టీడీపీకి ఎవరు దొరుకుతారు ? పనబాక లక్ష్మి నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందోనని టీడీపీ నాయకులు భయపడుతున్నారట. 

చంద్ర‌బాబు, సోమువీర్రాజు నియోక‌వ‌ర్గాల్లో కూడా వాళ్ల ప‌ట్టు క‌నిపించ‌క‌పోవ‌డం ఇప్పుడు టీడీపీ, బీజేపీల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది. ఈ ఫ‌లితాల షాక్ నుంచి తేరుకోక ముందే తిరుప‌తి  ఉపఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌ల కావడంతో ఇప్పుడు ఈ రెండు పార్టీల్లో టెన్ష‌న్ వాత‌వ‌ర‌ణం నెల‌కొంది. 

తొలి నుంచి ఇక్క‌డ నుంచి  పోటీ చేయ‌డానికి స‌ముఖంగా లేని ప‌న‌బాక ల‌క్ష్మీ తాజాగా మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో బ‌రిలో ఉంటారా? ఉండ‌రా..? అనేదానిపై పార్టీలోనే సందేహాలు నెల‌కొన్నాయి.

ఒక వేళ ఆమె బ‌రి నుంచి త‌ప్పుకుంటే ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో ఇప్ప‌టికిప్పుడు టీడీపీ నుంచి తిరుప‌తి పోటీ చేయ‌డానికి అభ్య‌ర్ధ‌ని ఎంపిక చేయ‌డం త‌ల‌కుమించిన  భారం అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టికి ఉన్న వేవ్ చూస్తే ఇక్క‌డ నుంచి బ‌రిలో నిలబడటానికి  ఎవరూ ముందుకొచ్చే ప‌రిస్థితులు ఉండ‌క‌పోవ‌చ్చనే చర్చ జరుగుతోంది. 

ఇదిలా ఉంటే మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీది కూడా వింత ప‌రిస్థితే అని చెప్పుకోవాలి. ఇక్క‌డ పోటీ చేసిన అభ్య‌ర్ధికి డిపాజిట్లు కూడా వ‌స్తాయో రావో అనే సందేహాలు పార్టీలో సీనియ‌ర్ నేత‌ల‌కే ఉన్నాయ‌ని టాక్.

పొత్తులో భాగంగా జ‌న‌సేన సూచించిన అభ్య‌ర్ధికి సీటు కేటాయిస్తామ‌ని అనుకున్న త‌రువాత ప‌లు కార‌ణాల వ‌ల‌న బీజేపీ అభ్యర్థినే  ఇక్క‌డ నుంచి బ‌రిలో దించ‌డానికి నిర్ణ‌యించుకున్నారు. అయితే బ‌రిలో నిల‌వ‌డానికి ఎవ్వ‌రు ముందుకొచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని వాపోతున్నారు పార్టీలో ప‌లువురు నేత‌లు. 

సీనియ‌ర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాస‌రి శ్రీనివాసులు బ‌రిలో నిలుస్తారనేది కూడా ఇప్పుడు సందేహాంగా ఉంది. మొన్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీజేపి నుంచి పోటీ చేసిన అభ్య‌ర్ధ‌ల‌కు వ‌చ్చిన ఓట్లు చూస్తే ఇక్క‌డ ఆ పార్టీ ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. 

ఇదిలా ఉంటే బీజేపీ శ్రేణులు మాత్రం ఇక్క‌డ నుంచి త‌మ పార్టీ అభ్య‌ర్ధిని గెలిపిస్తే కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌నే ప్ర‌చారం కూడా చేస్తున్నారు.  అయిన‌ప్ప‌టికి ఇక్క‌డ నుంచి బ‌రిలో నిల‌వ‌డానికి ముందుకు రావ‌డానికి  జంకుతున్నార‌నే తెలుస్తోంది. మొత్తంమీద నాగార్జున సాగర్ లో, తిరుపతిలో వింత పరిస్థితులు నెలకొన్నాయి. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు