కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మోడీ కూడా మొదటిసారి ప్రధాని అయ్యారు. మొదటి టర్మ్ లో వీరిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇద్దరి మధ్య సంబంధాలు బాగుండటంవల్లనే మోడీని ఒప్పించి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లగలిగారు. రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు.
మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక వాళ్లిద్దరి సంబంధాలు దెబ్బతిన్నాయి. అందులోనూ కేసీఆర్ కు జాతీయ రాజకీయాల యావ పట్టుకుంది. దేశానికి నాయకత్వం వహించాలనే తాపత్రయం ఎక్కువైంది. రరకాల కారణాలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. వైరం ప్రబలింది. ఇలా కావడానికి మోడీ తప్పులుండొచ్చు. కేసీఆర్ లోపాలూ ఉండొచ్చు.
రెండు రాజకీయ పార్టీల మధ్య, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉండటం సహజం. ఈ దేశంలో ఇవి కొత్త కాదు కూడా. రాజకీయంగా విభేదాలు ఉండొచ్చుగానీ అవి వ్యక్తిగత వైరాలకు దారి తీయకూడదు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవంటారు. ఎవరికీ ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు. కానీ కేసీఆర్ మాత్రం ప్రధాని మోడీపై వ్యక్తిగత వైరాన్ని పెంచుకున్నారు. దాన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు.
చివరకు కేసీఆర్ వ్యక్తిగతంగా మోడీకి స్వాగతం పలికేందుకు కూడా ఇష్టపడటంలేదు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కూడా మోడీకి సంబంధించిన మనిషి మాదిరిగా, బీజేపీ నాయకురాలిగానే పరిగణిస్తున్నారు. ఆమె విషయంలో కూడా ప్రోటోకాల్ పాటించకుండా పలుసార్లు అవమానించారు. మోడీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారు.
ప్రధానిని, గవర్నర్ ను తన శత్రువులుగా చూస్తున్నారేగానీ వారి పదవులను గౌరవించడంలేదు. కేసీఆర్ ధోరణి చివరకు అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నట్లుగా తయారైంది. అది ఎలా అంటే …సాధారణంగా అసెంబ్లీ సమావేశాలప్పుడుగానీ, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే ముందుగానీ స్పీకర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం ఎప్పుటినుంచో ఉన్న సంప్రదాయం.
ప్రభుత్వంతో లేదా అధికార పార్టీతో తీవ్ర విభేదాలున్న పార్టీలన్నీ ఆ సమావేశానికి హాజరవుతుంటాయి. సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలని, అందుకు అన్ని పార్టీలు సహకరించాలని స్పీకర్ కోరుతారు.
సమావేశాల కోసం చేసిన ఏర్పాట్ల గురించి వివరిస్తారు. సరే …సభ్యులు తాము చేసే పనులు సభలో చేస్తారనుకోండి. అది వేరే సంగతి. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా కూడా అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన పార్టీల్లో మోడీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ మిత్ర పార్టీలు కూడా ఉన్నాయి.
కానీ టీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరూ హాజరు కాలేదు. కారణం మోడీపై కోపం. స్పీకర్ బీజేపీ వ్యక్తి కదా. అందుకే టీఆర్ఎస్ హాజరు కాలేదు. దీన్నిబట్టి చూస్తే అర్ధమవుతోంది కేసీఆర్ కోపం ఎంత పీక్ స్టేజ్ లో ఉందో.