బీసీలకు మోదీ చేసిందేమీ లేదు

బీసీలు పిడికిలి బిగిస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఒక వైపు సాగుతున్న నేపధ్యంలోనే దేశం మొత్తానికి తెలిసేలా తన బలమైన వాణిని వినిపించాలని నిర్ణయించుకున్నట్లుగా జాతీయ…

బీసీలు పిడికిలి బిగిస్తున్నారు. తమ హక్కుల సాధన కోసం చలో ఢిల్లీ అంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఒక వైపు సాగుతున్న నేపధ్యంలోనే దేశం మొత్తానికి తెలిసేలా తన బలమైన వాణిని వినిపించాలని నిర్ణయించుకున్నట్లుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ విశాఖలో ప్రకటించారు. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర దేశంలో బీసీలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు.

బీసీలకు కేంద్రం ఇన్నేళ్లలో ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయలేదని తప్పుపట్టారు. బీసీల కుల గణన చేయమంటున్నా మోడీ సర్కార్ అసలు పట్టించుకోకపోవడమేంటి అని ఆయన ప్రశ్నించారు. అలాగే  బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా బీసీ మహిళలకు ప్రభుత్వ  ఉపాధి సహా చట్ట సభలలో ప్రవేశానికి రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. హలో బీసీ చలో ఢిల్లీ అన్న నినాదంతో పెద్ద ఎత్తున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతామని చెప్పారు. 

ఆగస్ట్ 2, 3 తేదీలలో జరిగే ఈ నిరసనతో కేంద్రం దిగిరావాలని ఆయన అంటున్నారు. మొత్తానికి బీసీ గోస కేంద్ర పెద్దలకు తెలిసిరావాలని ఏపీవ్యాప్తంగా అధిక సంఖ్యలో బీసీలు ఢిల్లీ బాట పట్టనున్నారని పేర్కొన్నారు.