విప‌క్షాల ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మార్గ‌రెట్ ఆల్వా

విప‌క్షాల ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా క‌ర్నాట‌క‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ ఆల్వాను ఎంపిక చేశారు. ఎన్‌డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన…

విప‌క్షాల ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా క‌ర్నాట‌క‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు, మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ ఆల్వాను ఎంపిక చేశారు. ఎన్‌డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ప‌శ్చిమ‌బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జ‌గ‌దీప్ ధ‌న్క‌ర్‌ను ఇప్ప‌టికే ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. ఒక రోజు ఆల‌స్యంగా త‌మ అభ్య‌ర్థి మార్గ‌రెట్ అని ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ ఆదివారం ప్ర‌క‌టించారు.

మార్గ‌రెట్ ఆల్వా 1942, ఏప్రిల్ 14న క‌ర్నాట‌క‌లోని మంగ‌ళూరులో జ‌న్మించారు. న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా అందుకున్నారు. విద్యార్థి ఉద్య‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1969లో రాజ‌కీయాల్లో ప్ర‌వేశించారు. 1974లో తొలిసారి కాంగ్రెస్ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

ఆ త‌ర్వాత వ‌రుస‌గా 1980, 1986, 1992లో పెద్ద‌ల స‌భ‌కు ఎన్నిక‌య్యారు. కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు.  1999లో ఉత్త‌ర క‌న్న‌డ లోక్‌స‌భ స్థానం నుంచి ఎన్నిక‌య్యారు. 2004లో ఓడిపోయారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా ప‌ని చేసిన అనుభ‌వం ఆమె సొంతం. 1975, 1977 మధ్య అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా 1978, 1980 మధ్య కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

అలాగే గ‌తంలో గోవా, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఆమెకు ఉంది. ఇదిలా వుండ‌గా మార్గ‌రెట్ అభ్య‌ర్థిత్వాన్ని 17 పార్టీలు ఏక‌గ్రీవంగా ఆమోదించిన‌ట్టు శ‌ర‌ద్ ప‌వార్ వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఆమె నామినేష‌న్ వేస్తార‌న్నారు. 

త‌న‌ను ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌డంపై మార్గ‌రెట్ ట్విట‌ర్‌లో స్పందిస్తూ…. ఎంతో గౌర‌వంగా భావిస్తున్న‌ట్టు చెప్పారు. విప‌క్షాల నిర్ణ‌యాన్ని విన‌యంతో స్వీక‌రిస్తున్న‌ట్టు ఆమె వెల్ల‌డించారు.