టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వరుసగా రెండో రోజు సమావేశం అయింది.దస్ పల్లా హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల నిర్మాతలు అందరూ హాజరయ్యారు.
నిర్మాణ వ్యయం, నటీనటుల రెమ్యూనిరేషన్లు, నటీనటుల స్టాఫ్ తో సమస్యలు, అన్నీ చర్చకు వచ్చాయి. ఒక వారం రోజుల్లో షూటింగ్ లు ఆపాలన్న నిర్ణయం బలంగా తీసుకున్నారు. కానీ దీనిపై నిర్మాతలు అంతా వారి వారి అభిప్రాయాలు తెలియచేయడానికి రెండు రోజులు గడువు ఇచ్చారు.
ఇదిలా వుంటే గిల్డ్ తరపున ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తో కూడా డిస్కషన్లు చేసారు. గిల్డ్, కౌన్సిల్ అన్నీ ఒక మాట మీదకు ఒక తాటి మీదకు రావాలని అనుకున్నారు. ఈ మేరకు అవసరం అయితే కౌన్సిల్, ఛాంబర్ సర్వ సభ్య సమావేశాలు నిర్విహించాలని ఆలోచిస్తున్నారు.
అదే విధంగా ఆచార్య సినిమా వ్యవహారాలు కూడా చర్చకు వచ్చాయి. ఎప్పుడూ లేనిది నిర్మాతతో సంబంధం లేని థర్డ్ పార్టీ బయ్యర్లు కూడా ఆఫీసుల మీదకు రావడం అన్నది టాలీవుడ్ పరిస్థితికి అద్దం పడుతోందని, ఇంక ఎన్నారె లు, ఎంజి లు, అగ్రిమెంట్ ల విలువ ఏమిటి అని కొందరు ప్రస్తావించారని తెలుస్తోంది.
సినిమా నష్టపోతే నిర్మాత, దర్శకుడు వెనక్కు ఇవ్వడం జరుగుతోంది తప్ప హీరోలు, నటులు, ఇంకా మిగిలన వారు మాత్రం హ్యాపీగా వుంటున్నారని, దీన్ని కూడా కరెక్షన్ చేయాలని కొందరు అభిప్రాయపడ్డారు.
మొత్తం మీద టాలీవుడ్ నిర్మాణ వ్యయం ప్రక్షాళన దిశగా గట్టి అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 1 నుంచి సినిమాల నిర్మాణాలు బంద్ పెట్టే అవకాశం వుంది.