మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. వామపక్ష ఉద్యమ నేపథ్యం, కేసీఆర్‌తో కలిసి తెలంగాణ సాధనలో అలుపెరగని పోరాటం..ఇలా అనేక అంశాలు ఈటలకు తెలంగాణలో ప్రత్యేక గౌరవం తెచ్చాయి.
కేసీఆర్‌తో విభేదాలు, ఇటీవల మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌నకు దారి తీసిన రాజకీయ పరిస్థితులు ఈటలను వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి. చివరికి తెలంగాణ అధికార పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా గుడ్‌బై చెప్పాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నెల 13న ఈటల బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీ పెట్టనున్న వైఎస్ షర్మిల …మాజీ మంత్రి ఈటల తమ పార్టీలో చేరాలని ఆహ్వానించడం గమనార్హం. షర్మిల వైపు నుంచి ఈటల లాంటి రాజకీయ నేత రావాలని ఆశించడంలో తప్పులేదు. కానీ తనువు, మనసు తెలంగాణను నింపుకున్న ఈటల రాజేందర్ కొత్త పార్టీలోకి వెళ్తారనుకోవడం ఉత్త భ్రమ.
తెలంగాణలో మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీని కాకుండా ఈటల మరో ఆలోచన చేస్తారని ఎవరూ అనుకోరు. ఈటల కోసం కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నం చేసింది. అయితే దేశంలో లేదా తెలంగాణలో కనుచూపు మేరలో కాంగ్రెస్‌కు భవిష్యత్ కనిపించకపోవడంతో తన సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టి బీజేపీలో చేరేందుకు ఈటల నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా లోటస్‌పాండ్‌లో బుధవారం పార్టీ ముఖ్యనేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజకీయ పంథాపై షర్మిల వ్యాఖ్యానించారు. ఈటల వస్తానంటే ఆహ్వానిస్తామని ఆమె అన్నారు.
కేసులకు భయపడి ఈటల బీజేపీలో చేరుతున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వారిపై కేసులు పెట్టడం కామన్ అని, కేసులకు భయపడి బీజేపీలో చేరడం కూడా కామన్ అయిపోయిందన్నారు. ఇప్పటి వరకు ఈటల విషయంలో ఎలాంటి చర్చ లేదని చెప్పారు.