పాస్ పోర్ట్, వీసాతో పాటు.. విదేశీ ప్రయాణాలకు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా ఇప్పుడు తప్పనిసరి. అయితే ఈ వ్యాక్సినేషన్ విషయంలోనే ఇప్పుడు భారతీయులకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ప్రయాణాలపై ఆంక్షలు సడలిస్తున్న దేశాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూనే 'కొవాక్సిన్ తప్ప' అనే రూల్ పెట్టాయి.
అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా వంటి దేశాలు.. తమ ప్రభుత్వం అనుమతిచ్చిన, లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతిచ్చిన టీకాలను మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నారు. అవి వేసుకుంటేనే.. వారికి వ్యాక్సినేషన్ జరిగినట్టు లెక్క. ఆ లెక్కన తీసుకుంటే.. భారత్ లో వేసే కొవాక్సిన్ అసలు లెక్కలోకే రాదు. అవును, కొవాక్సిన్ కి డబ్ల్యూహెచ్ఓ అనుమతి లేదు, ఇతర దేశాలకు నేరుగా ఈ భారత్ బయోటెక్ టీకాకు వినియోగ అనుమతి మంజూరు చేయలేదు. అందుకే కొవాక్సిన్ వేయించుకున్న వాళ్లకు కి ఆయా దేశాల్లో నో ఎంట్రీ అంటున్నాయి.
చిక్కుల్లో విద్యార్థులు..
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులంతా భారత్ లో టీకా కోసం క్యూ కడుతున్నారు. నిన్న మొన్నటి వరకు 45 ఏళ్లు పైబడినవారికి మాత్రమే టీకాలిస్తుండటంతో వీరంతా ఫస్ట్ లిస్ట్ లోకి రాలేకపోయారు. ఇటీవల విదేశీ ప్రయాణాలున్నవారికి కూడా ప్రయారిటీ ఇవ్వడంతో వీరంతా తొలి డోసు వేయించుకున్నారు.
అసలు విషయం తెలియక కొంతమంది కొవాక్సిన్ తీసుకున్నారు. దీంతో వీరు డైలమాలో పడ్డారు. కొవాక్సిన్ ని కొన్ని దేశాలు టీకాగా గుర్తించడం లేదు. అది వేసుకుంటే అమెరికా, బ్రిటన్ వెళ్లినా కూడా అక్కడ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిందే, కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి ఇచ్చిన పరిమితులన్నీ వీరికి ఇవ్వరు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్సిన్ కి అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చేవరకు హోమ్ క్వారంటైన్లోనే ఉంటాం అని అంగీకరిస్తేనే బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు తమ దేశంలోకి అడుగుపెట్టనిస్తాయట. ఇదెక్కడి గోల అని తలపట్టుకుంటున్నారు విద్యార్థులు.
టీకా క్యాన్సిల్ చేసుకోవచ్చా..?
తొలి డోసు కొవాక్సిన్ తీసుకున్నవారిలో కొంతమంది అసలు విషయం తెలిశాక, రెండో డోసు కొవిషీల్డ్ తీసుకుంటామంటూ ముందుకొస్తున్నారట. అయితే భారత్ లో ఈ మిక్సింగ్ అనుమతి లేకపోవడంతో వైద్యులు వారికి నచ్చజెప్పి పంపించేస్తున్నారు.
ఫస్ట్ డోస్ పూర్తిగా కాన్సిల్ చేసుకుంటామని, ఇకపై రెండు డోసులు కొవిషీల్డ్ తీసుకుంటామని అభ్యర్థించేవారు కూడా ఉన్నారట. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకముందే డీసీజీఐ అనుమతిచ్చినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతివ్వకపోవడంతో కొవాక్సిన్ తీసుకున్నవారు విదేశాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు.