వైఎస్సార్ బీమా పథకంలో మార్పులు పేరుతో కోతకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పథకం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే సొమ్ములో కోత పెట్టేందుకు జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చి జూలై 1 నుంచి అమలు చేసేందుకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం అధికారులు, మంత్రులతో వైఎస్సార్ బీమా పథకంపై సీఎం సమీక్షించారు.
ఇప్పటి వరకూ ఈ పథకం అమలు తీరు ఎలా ఉందో తెలుసుకుందాం. 18-70 ఏళ్లు వయస్సు ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తోంది. బియ్యం కార్డు ఉండి, కుటుంబం ఆధారపడ్డ వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం, లేదా సహజ మరణం చెందితే ఆ కుటుం బానికి ఈ బీమా వర్తిస్తోంది.
ఈ పథకం కింద 18–50 ఏళ్ల మధ్య వయసున్న వారు సహజంగా చనిపోతే అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం.. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తూ మరణం సంభవిస్తే రూ.5 లక్షలు ఇస్తున్నారు. అలాగే 51–70 ఏళ్ల వయస్సు వారు ప్రమాదంలో శాశ్వత వైకల్యం పొందినా లేదా ప్రమాదవశాత్తూ మరణించినా బాధిత కుటుంబాలకు రూ.3 లక్షలను అందిస్తున్నారు. ఈ పథకంలో తాజాగా మార్పులు తీసుకొస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.
పథకంపై సమీక్ష సందర్భంగా సీఎం మాట్లాడుతూ మృతుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా సాయం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షలు సాయం అందజేయాలని సీఎం అదేశించారు.
వచ్చే నెల ఒకటి నుంచి కొత్త మార్పులతో వైఎస్ఆర్ బీమా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈలోపు సంపాదించే వ్యక్తుల మరణాలకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో బీమా పరిహారం చెల్లించాలని సీఎం జగన్ అన్నారు. బీమా పరిహారంపై ప్రత్యేక అధికారిని నియమించాలని జగన్ చెప్పారు.
ఇదిలా ఉండగా తాజాగా తీసుకొచ్చిన మార్పులతో జనానికి కొత్తగా కలిగే ప్రయోజనాలు శూన్యమనే చెప్పాలి. పైగా సగానికి సగం పరిహారంలో కోత విధించడం గమనార్హం. ఇప్పటి వరకూ సహజ మరణం సంభవిస్తే రూ.2 లక్షలు చొప్పున ఇస్తూ వచ్చారు. ఇక మీదట వచ్చే నెల నుంచి అందులో సగం అంటే రూ.లక్ష మాత్రమే ఇవ్వనున్నారు. ఇక ప్రమాదవశాత్తు మరణిస్తే మాత్రం పరిహారంలో ఎలాంటి తేడా లేదు.
ఇక 50 ఏళ్లకు పైబడిన వాళ్లు చనిపోతే బీమా ఏంటనే విషయమై స్పష్టత కొరవడింది. మార్పు అంటే తొలగించడమే అని అర్థం చేసుకోవాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా మార్పుల వల్ల జనానికి ఒనగూరే ప్రయోజనాలు ఏంటనేది ప్రశ్నార్థకమైంది.
ఒక చేత్తో ఇచ్చినట్టే ఇస్తూ, మరో చేత్తో లాక్కోవడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి పేరుతో భరోసా కల్పించేందుకు వైఎస్సార్ బీమా అని పథకానికి పేరు పెట్టి, మరోవైపు తాను మాత్రం కోత విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో?