అందాల తార సమంత, ఫ్యామిలీ మేన్-2లో మాత్రం డీ-గ్లామరైజ్డ్ గా కనిపించింది. ఇంకా చెప్పాలంటే సిరీస్ మొత్తం ఆమె నల్లగా కనిపించింది. ఆమె తెల్లటి ముఖాన్ని నల్లటి మేకప్ తో కప్పేశారు. ఇదంతా కావాలనే చేశారని, సమంతను అందవిహీనంగా తయారుచేశారంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం కొత్త రచ్చ మొదలుపెట్టింది.
ఈ వాదనను పూర్తిగా ఖండించారు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే. తమిళ ఈలంకు చెందిన ఓ యోధురాలు ఎలా ఉండాలో అలానే సమంత కనిపించిందని, రాజీ పాత్రను అందంగా చూపించడం అస్సలు కరెక్ట్ కాదని అంటున్నాడు రాజ్.
“ఆ పాత్ర అలాంటిది. అమ్మాయి నల్లగా ఉందా లేక అందంగా ఉందా అని లెక్కలేసే పాత్ర కాదిది. ఆమె ఓ సైనికురాలు. ఆమె ఓ పోరాట యోధురాలు. ఆమె ఒక ఆయుధం. భయంకరమైన పరిస్థితుల్లో అణచివేతకు గురైన ఓ మహిళ. ఇంతకుముందు ఎన్నో ఫిమేల్ పాత్రలు చాలా సౌకర్యవంతంగా, అందంగా ఫైట్ చేసి ఉండొచ్చు. కానీ ఇది అలాంటి పాత్ర కాదు. ఆమె ఇలానే కనిపించాలి.”
రాజీ పాత్ర అందానికి సంబంధించిన విషయం కాదంటున్నాడు రాజ్. ఇదే విషయాన్ని కృష్ణ డీకే కూడా చెబుతున్నాడు. ఆమెను కళావిహీనంగా చూపించాలనేది తమ ఆలోచన కాదని, అదంతా క్యారెక్టర్ ప్యాకేజీలో భాగం అంటున్నాడు.
“పాత్రకు తగ్గట్టు ఒదిగిపోవాల్సి వస్తే ఆమె అలా కనిపించాల్సిందే. ఈ పాత్ర కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంది. భాష నేర్చుకుంది. చివరికి ఆమె ధరించిన దుస్తులు కూడా పాత్రకు అనుగుణంగానే ఉన్నాయి. ఇదంతా ఓ ప్యాకేజీ. ఇక్కడ అందం గురించి ప్రస్తావన అనవసరం. ఆమె అలానే కనిపిస్తుంది. కనిపించాలి కూడా.”
ఇలా సోషల్ మీడియాలో సమంత అందంపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టారు ఈ దర్శక ద్వయం. ఫ్యామిలీ మేన్-2 హిట్ అవ్వడంతం పాటు రాజీ పాత్ర బాగా క్లిక్ అవ్వడంపై సంతోషం వ్యక్తంచేసిన ఈ దర్శకులు.. రాజీ పాత్రకు సంబంధించి క్రెడిట్ మొత్తం సమంతకే దక్కుతుందంటున్నారు.