కరోనా ఫేజ్ వన్ కు ఫేజ్ టు టాలీవుడ్ కు సంబంధించినంత వరకు తేడా ఏమిటంటే ఓటిటి సంస్థలు సినిమాలు కొనడం లో ఆచి తూచి వ్యవహరించడం. గతంలో దూకుడుగా సినిమాలు కొనేసిన ఓటిటి ప్లాట్ ఫారమ్ లు ఈసారి మాత్రం గీసి గీసి బేరాలు ఆడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పుడు తమకు కొనే ఆలోచన లేదంటున్నాయి.
కొన్ని సంస్థల ప్రతినిధులను గ్రిప్ లోకి తీసుకున్న వారి ద్వారా మాత్రం కొనుగోళ్లు కొంచెం సాగుతున్నాయి. అయితే కొన్ని ఓటిటి లను గ్రిప్ లోకి తీసుకున్న వారి ద్వారా అయినా అమ్మాలి. అలా అమ్మితే వారికి భారీగా కమిషన్లు ముట్ట చెప్పాలి. పైగా వారి అక్కౌంట్లలోకి నేరుగా డబ్బులు రావు. అవతలి వారి అక్కౌంట్లలోకి వెళ్లి, వాళ్ల దయాధర్మం మీద ఇక్కడకు రావాల్సి వుంటుంది.
దాదాపు రెడీ అయిన చిన్న సినిమాలు కొన్ని వున్నాయి. వాటిని ఓటిటి ఇచ్చేద్దామనే ప్రయత్నాలు చేస్తుంటే పెద్దగా రేటు పలకడం లేదు. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ ఇచ్చేసిన సినిమాలే చాలా వరకు. ఇప్పుడు అదనంగా ఆ మొత్తం మీద మహా అయితే 10 శాతం అదనంగా ఇస్తాం అంటున్నాయి ఒటిటి సంస్థలు. అంటే థియేటర్ రిలీజ్ వాల్యూ జస్ట్ 10శాతమే అని లెక్క కడుతున్నాయన్నమాట.
ఈ పాటి దానికి ఓటిటికి ఇవ్వడం ఎందుకు? ఆ మాత్రం పదిశాతం థియేటర్ల నుంచి రాదా? అని థియేటర్ విడుదలకే మొగ్గు చూపుతున్నారు. జెమిని టివి కి శాటిలైట్ అమ్మిన వారికి ఇంకో సమస్య ఏమిటంటే, ఆ సంస్థ డిజిటల్, థియేటర్ ఇలా అన్ని కలిపి కొనడానికి పెద్దగా మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే ఆ సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్న వారు దాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వుంటుంది.
మొత్తం మీద చిన్న, మీడియం సినిమాలకు 'మధ్యవర్తుల' అండ దండలు, కమిషన్ వ్యవహారాలు లేకుండా ఓటిటి ల నుంచి సరైన మద్దతు లభించడం లేదు అని ఇప్పుడిప్పుడే టాలీవుడ్ కు క్లారిటీ వస్తోంది. ప్రతి చోటా 'మాఫియా రింగ్' ఏర్పడినట్ల ఆఖరికి ఇక్కడ కూడా అలాంటి వ్యవహారం తయారవుతోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.