కరోనా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలకు కారణమవుతోంది. కొందరు కరోనాను పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లు తమ సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ విపత్కర కాలంలో పుట్టిన తమ పిల్లలకు జీవితాంతం గుర్తు ఉండేలా…అందుకు తగ్గ పేర్లు పెట్టి మురిసిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో పుట్టిన ఓ బాబుకు అతని తల్లిదండ్రులకు ఓ బాబు పుట్టాడు. తమ బాబుకు ఓ ప్రత్యేకమైన పేరు పెట్టాలని తల్లిదండ్రులు ఆలోచించారు. దీంతో వాళ్లు తమ సృజనకు పని పెట్టారు. బాగా ఆలోచించి తమ కుమారుడికి ‘లాక్‌డౌన్’ అని పేరు పెట్టారు. ఈ పేరు అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ విషయమై లాక్‌డౌన్ తండ్రి పవన్ మాట్లాడుతూ తమకు లాక్‌డౌన్ కాలంలో కొడుకు పుట్టాడని చెప్పాడు. కరోనాను అడ్డుకునేందుకు ప్రధాని మోడీ లాక్‌డౌన్ విధించాడన్నాడు. జాతీ ప్రయోజనాల కోసం లాక్‌డౌన్ విధించారని, అందుకే తమ కుమారుడికి గుర్తుగా ఆ పేరు పెట్టామని మురిసిపోతూ చెప్పాడు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే తమ కుమారుడిని ఎవరైనా చూడటానికి రావాలని కోరాడు.
అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన ఆడబిడ్డకు కూడా ఆకట్టుకునే పేరు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ జిల్లాలో ఉంటున్నమహిళకు జనతా కర్ఫ్యూ సమయంలో ఆడబిడ్డ పుట్టింది. ఈ బిడ్డకు మేనమామ నితీష్ త్రిపాఠి బాగా ఆలోచించి ‘కరోనా’ అని పేరు పెట్టాడు.
ఈ సందర్భంగా నితీష్ త్రిపాఠి మాట్లాడుతూ ‘కరోనా వైరస్ అందరిని ఒక్కటి చేసి పోరాడేలా చేస్తోంది. కరోనా వైరస్ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు. చాలా మందిని బలితీసుకుంది. కానీ కరోనా వైరస్ మనకి చాలా మంచి అలవాట్లను నేర్పించింది. అందరినీ దగ్గర చేసింది. ఈ పాప చెడుకు వ్యతిరేకంగా ఐకమత్యంగా చేసే పోరాటానికి ప్రతీక’ అని ఆయన చెప్పాడు.
వీళ్లద్దరి పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పేర్లు పెట్టడంలోని వాళ్ల ఉద్దేశాలు కూడా చాలా వివేకవంతంగా ఉన్నాయి. ఒక విపత్తును చూడటంలో ఒక్కొక్కరి దృష్టి ఒక్కో రకంగా ఉంటుంది. కరోనా, లాక్‌డౌన్ అని పేర్లు పెట్టడం వెనుక ఉన్న స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన అవసరం ఉంది.