కరోనా ప్రభావం వల్ల ఆ రంగం, ఈ రంగం అని కాదు.. అన్ని రంగాల వాళ్లూ నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి భారీ పెట్టుబడులతో వ్యాపారం చేసే వాళ్లకు ఈ సందర్భంగా నష్టాలు గట్టిగానే ఉండవచ్చు. ఈ ప్రభావం ఇప్పుడు రెండు బాలీవుడ్ సినిమాలపై గట్టిగా పడుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రెండు సినిమాలే సూర్యవంశీ, 1983.
లెక్క ప్రకారం ఈ సమ్మర్ లో ఈ రెండు సినిమాలూ విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడప్పుడే ఏ సినిమాలూ విడుదల అయ్యే పరిస్థితి లేదు. చివరగా విడుదల అయిన బాలీవుడ్ సినిమా 'అంగ్రేజీ మీడియం'. అది విడుదల అయిన మరుసటి రోజే లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో ఆ సినిమా కూడా విడుదల అయ్యిందనే మాటే కానీ, థియేటర్లలో సరిగా నాలుగు షోలు కూడా పడనట్టే.
ఇక సూర్యవంశీ, 1983 విషయానికి వస్తే.. ఈ రెండూ భారీ సినిమాలే. అక్షయ్ కుమార్ హీరోగా సూర్యవంశీ రూపొందింది. ఆ సినిమాలో అజయ్ దేవగణ్, రణ్ వీర్ లు గెస్ట్ అప్పీరియన్స్. ఆ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక 1983 లో క్రికెట్ వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా విజయయాత్ర గురించి రూపొందించిన 1983 విషయంలో కూడా సమ్మర్ లో మంచి వసూళ్లకు అవకాశం ఉందని భావించినట్టున్నారు. అయితే ఈ సినిమాల విడుదల అనుకున్న తేదీల్లో జరగదని స్పష్టం అవుతోంది.
ఏప్రిల్ రెండో వారం కూడా సినిమాల విడుదల లేనట్టే. ఆ తర్వాత పరిస్థితి ఎప్పుడు సద్దుమణుగుతుందో కూడా ఇంకా క్లారిటీ లేదు. అందునా.. కొన్నాళ్ల పాటు జనాలు థియేటర్లకు వెళ్లేందుకు వెనుకాడవచ్చు కూడా! ఈ క్రమంలో విడుదల డిలే అయ్యి, వడ్డీలు పెరిగిపోయి.. ఈ రెండు భారీ సినిమాలూ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.