యూపీ ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నా.. అప్పుడే అక్కడి రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒకవైపు కరోనా సెకెండ్ వేవ్ లో కొనసాగుతూ ఉంది. మళ్లీ థర్డ్ వేవ్ ఉంటుందంటున్నారు. ఇంకోవైపు వ్యాక్సిన్ల పంపిణీ మందకొడిగా సాగుతూ ఉంది.
వ్యాక్సిన్ల బాధ్యతను పూర్తిగా కేంద్రం తీసుకున్నట్టుగా ప్రధాని ప్రకటించారు కానీ, దేశ నిజమైన అవసరాలకు తగినట్టుగా ఎప్పటికి వ్యాక్సిన్లు సరఫరా అవుతాయనేది ప్రశ్నార్థకమే. వ్యాక్సినేషన్ పూర్తి చేయకపోతే కరోనా థర్డ్ వేవ్ లో కూడా విజృంభించే అవకాశాలు ఉండవచ్చు. కాబట్టి.. వ్యాక్సినేషన్ మోడీ సమర్థతకు అత్యంత పెద్ద పరీక్షగా మారింది.
ఆ సంగతలా ఉంటే.. యూపీ మీద ఇప్పటికే బీజేపీ, ఆర్ఎస్ఎస్ గట్టిగా దృష్టి సారించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంత కరోనాలో కూడా యూపీలో ఎలా గెలవాలనే అంశం గురించి సంఘ్ పరివార్ కసరత్తు చేస్తోందట. ఈ సమావేశాలకు ముఖ్య నేతలు హాజరువుతున్నారనే వార్తలు ఆశ్చర్యపరచకమానవు. యూపీలో గనుక బీజేపీ ఓడిపోతే.. జాతీయ స్థాయిలో కూడా ఆ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పక తప్పదు.
కేవలం గెలవడం కాదు, యూపీలో 2014 లోక్ సభ, 2017 అసెంబ్లీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో సాధించిన తరహా విజయాలను బీజేపీ రిపీట్ చేయగాల్సి ఉంది. అప్పుడే ఇంకా బీజేపీ వేవ్ గట్టిగా ఉందని అనుకోవాల్సి వస్తుంది. యూపీలో పడితే.. బీజేపీపై రాజకీయ ధిక్కార స్వరాలు వినిపించే అవకాశాలు చాలా వరకూ పెరుగుతాయి. ఈ నేపథ్యంలో యూపీ కమలం పార్టీకి తీవ్ర ప్రతిష్టాత్మక అంశంగా మారుతోంది.
యోగి ప్రభుత్వ పనితీరును కూడా కమలం పార్టీ సమీక్షించుకోవడం ఇప్పుడే మొదలైందట. అందుకే యోగిని దించి మరొకరిని అక్కడ సీఎం పీఠంపై కూర్చోబెడతారనే ప్రచారాలు జరిగాయి. అయితే తనను ఎవరూ పదవి నుంచి దించరని స్వయంగా యోగి ఆదిత్యనాథ్ ప్రకటించుకున్నారు. అలాగే తనకు ఇంకా పెద్ద పదవులు చేపట్టాలనే ప్రత్యేక లక్ష్యాలు ఏవీ లేవని యోగి అన్నారు. అయితే ఆయన కొంత నర్మగర్భంగా మాట్లాడినట్టుగా అనిపించకమానదు. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు సీఎం కావాలని తను అనుకోలేదని , అదలా జరిగిందన్నట్టుగా యోగి చెప్పారు.
మరోవైపు యూపీలో గనుక మునుపటి రీతిలో .. బీజేపీ సంచలన విజయాన్నే నమోదు చేస్తే, యోగి తదుపరి అడుగులు ఢిల్లీ వైపు పడే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా ఉత్తరాది మీడియాలోనే జరుగుతూ ఉంది. దేశంలోనే అత్యధిక లోక్ సభ సీట్లున్న రాష్ట్రంలో స్వీప్ చేయగలిగితే బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ ఇమేజ్ పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయి.
బీజేపీలోని హిందుత్వవాదుల్లోని కొందరు కూడా మోడీ కన్నా..యోగిని ప్రధానిని చేయాలనే వారు ఇప్పటికే ఉన్నారు! ఈ క్రమంలో యూపీలో బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తే.. ఆ పార్టీలోనే రకరకాల రాజకీయ సమీకరణాలు మారవచ్చేమో! బోటాబోటీ మెజారిటీతో బయటపడితే.. యోగి సీఎం పదవికి కూడా ఎసరు రావొచ్చు అని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.