ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కరోనా తగ్గుముఖం పట్టగానే టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించి తీరుతామని జగన్ సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీంతో పాలక ప్రతిపక్షాల మధ్య పంతాలు పట్టింపులకు వేదికగా టెన్త్, ఇంటర్ పరీక్షలు మారాయి. మరోవైపు తెలంగాణ సర్కార్ తాజాగా తీసుకున్న నిర్ణయం జగన్ సర్కార్‌పై మరింత ఒత్తిడి పెంచేలా ఉంది. తెలంగాణలో ఇంటర్ ద్వితీయ ఏడాది పరీక్షలను రద్దు చేస్తూ కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలపై మంగళవారం కేసీఆర్ కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈతో పాటు మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేశాయని కేబినెట్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సబబు కాదని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ పరీక్షలను రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రద్దు ప్రకటనను సాయంత్రం చేయనున్నట్టు సమాచారం.
ఇప్పటికే తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో వచ్చిన గ్రేడ్ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్ ఇవ్వనున్నట్టు సమాచారం. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు గత ఏడాది మాదిరిగానే కేసీఆర్ సర్కార్ ప్రమోట్ చేసింది. అయితే సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని భావించినా, కరోనా ఉధృతి అడ్డంకిగా మారింది.
మరోవైపు ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే పట్టుదలకు జగన్ సర్కార్ వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. మెజార్టీ అభిప్రాయం మాత్రం పరీక్షల రద్దు వైపే మొగ్గు చూపుతోంది. దీంతో ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై గత కొంత కాలంగా రాజకీయ దుమారం చెలరేగింది. ఇది ఏ విధంగా పరిష్కారమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది. కానీ కేసీఆర్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం ఏపీ సర్కార్‌పై ఒత్తిడి పెంచుతుందని చెప్పక తప్పదు.