విశాఖ ఇప్పటికే అందరి నోళ్ళల్లో నానుతోంది. విశాఖను రాజధాని చేస్తున్నామని వైసీపీ సర్కార్ ప్రకటించిన నాటి నుంచి రాజకీయ హడావుడి ఒక్కసారిగా పెరిగింది. మరో వైపు విపక్షాలు సైతం విశాఖ రాజధాని విషయంలో తోచిన రీతిన విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
అమరావతే ముద్దు, విశాఖ వద్దు అంటూ టీడీపీ ముందుకు కదులుతున్న విషయం కూడా విధితమే. ఇవన్నీ ఇలా ఉంటే విశాఖకు రాజధాని తరలివస్తుందని ఈ మధ్యనే వైసీపీ ప్రముఖ నేతలు ప్రకటించారు. అయితే ఇపుడు ఒక డేట్ కూడా ప్రచారంలో ఉంది.
మరి అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ జూలై 23న బ్రహ్మాండమైన ముహూర్తం ఒకటి ఉందని ఆ రోజున విశాఖకు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ షిఫ్ట్ అవుతుందని అంటున్నారు. మరి అది నిజమేనా అంటే ఇప్పటికి నలభై రోజులకు పైగా వ్యవధి ఉంది కాబట్టి ఎదురు చూడాల్సిందే.
ఏది ఏమైనా విశాఖకు రాజధాని రాక ఆలస్యం అయితే కావచ్చునేమో కానీ ఏకంగా ముఖ్యమంత్రి జగనే ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకుని రాజధాని కళను తీసుకురావడం మాత్రం తధ్యమనే అంటున్నారు. చూడాలి మరి ఆ రోజున ఏం జరుగుతుందో.