కేడ‌ర్ భేష్‌…లీడ‌రే స‌మ‌స్య‌!

జ‌న‌సేన బ‌లం కేడ‌ర్‌. జ‌న‌సేన బ‌ల‌హీన‌త లీడ‌ర్‌. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తే ఆ పార్టీకి త‌ప్ప‌క మంచి భ‌విష్య‌త్ వుంటుంది. అయితే ఏం లాభం…. పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల‌ని, సినీ, రాజ‌కీయ…

జ‌న‌సేన బ‌లం కేడ‌ర్‌. జ‌న‌సేన బ‌ల‌హీన‌త లీడ‌ర్‌. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తే ఆ పార్టీకి త‌ప్ప‌క మంచి భ‌విష్య‌త్ వుంటుంది. అయితే ఏం లాభం…. పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల‌ని, సినీ, రాజ‌కీయ అభిమానులు, నాయ‌కుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా తాను ముఖ్య‌మంత్రి కావాల‌నే త‌ప‌న‌, ప‌ట్టుద‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో లోపించింది. ఇదే ఆ పార్టీకి శాపంగా మారింది.

ఆంజ‌నేయుని శ‌క్తి ఏంటో ఆ మ‌హానుభావునికే తెలియ‌ని చందంగా… ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు త‌న పార్టీ సైనిక బ‌లం ఏంటో ఆయ‌న గుర్తించ‌డం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ర‌హ‌దారులు అధ్వానంగా మార‌డంపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ “గుడ్ మార్నింగ్ సీఎం సార్” పేరుతో  డిజిట‌ల్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇది మూడు రోజుల క్యాంపెయిన్‌.  

ఈ కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. అధ్వాన రోడ్ల‌కు పార్టీల‌కు అతీతంగా అంద‌రూ బాధితులే. జ‌న‌సేనాని ప‌వ‌న్‌ రావుల‌పాలెం నుంచి అమ‌లాపురం వెళ్లే ర‌హ‌దారిపై కొత్త‌పేట వ‌ద్ద గుంత‌ల రోడ్డు దుస్థితిని ఆవిష్క‌రించే వీడియోను ట్విట‌ర్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన రెండు గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట‌ర్ ట్రెండింగ్‌లో మొద‌టిస్థానంలో నిలిచిన‌ట్టు జ‌న‌సేన ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

21.8 కోట్ల మందికి చేరువైంద‌ని, అలాగే ఏపీలోని అధ్వాన రోడ్ల ఫొటోలు, వీడియోల‌ను పోస్టు చేస్తూ 3.55 ల‌క్ష‌ల ట్వీట్లు చేశార‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది. స‌మ‌యం గ‌డిచేకొద్ది ఇది మ‌రింత పెరుగుతూ పోతోంది. ఇది చిన్న విష‌యం కాదు. జ‌న‌సేన కేడ‌ర్ బ‌లాన్ని ఇది ప్ర‌తిబింబిస్తోంది.  

జ‌న‌సైన్యం ఉర‌క‌లేసే ఉత్సాహంతో ప‌ని చేస్తోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఒకే ఒక పిలుపు ఇస్తే చాలు… ప్రాణాలైనా ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌నే రేంజ్‌లో వారు ప‌ని చేస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. ఆ సైన్యాన్ని అధికారం వైపు న‌డిపే సైన్యాధ్య‌క్షుడైన ప‌వ‌న్‌క‌ల్యాణ్ సంక‌ల్పం బ‌లంగా లేదు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ వైఖ‌రితో జ‌న‌సేన రెండ‌డుగులు ముందుకు, నాలుగ‌డుగులు వెన‌క్కి అన్న‌ట్టుగా త‌యారైంది. ఏపీలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో, జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి కూడా అంతే. ముందు త‌న పార్టీకి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప‌నికాదు. 

చంద్ర‌బాబుపై ప్రేమ‌, జ‌గ‌న్‌పై ద్వేషంతో రాజ‌కీయాలు చేస్తున్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న పార్టీకి తానే గోతులు తీసుకుంటున్నారు. మ‌రోవైపు పొత్తులు, ఆప్ష‌న్లు అంటూ స‌మ‌యాన్ని వృథా చేసుకుంటున్నారు. పార్టీ బ‌లోపేతాన్ని గాలికొదిలేశారు. అందుకే ప‌వ‌న్‌ను మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. 

ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న పార్టీకి ప‌డ్డ గోతుల్ని పూడ్చుకుని, అధికారం వైపు సాగేలా అడుగులు వేయాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది.

సొదుం ర‌మ‌ణ‌