ప్ర‌జ‌ల గోడు విన‌డానికి జ‌గ‌న్ రెడీ!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త్వ‌ర‌లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు. ప్ర‌జ‌ల నుంచి నేరుగా విన‌తులు స్వీక‌రించి, వారి గోడు వినేందుకు ముఖ్య‌మంత్రి రెడీ అవుతున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. …

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త్వ‌ర‌లో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు. ప్ర‌జ‌ల నుంచి నేరుగా విన‌తులు స్వీక‌రించి, వారి గోడు వినేందుకు ముఖ్య‌మంత్రి రెడీ అవుతున్నారు. ఇందు కోసం ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. 

గ‌తంలో జ‌గ‌న్ తండ్రి, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న నేరుగా ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రిస్తూ, వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకున్నారు.

“నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను” అంటూ ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ ఏపీ ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను చూర‌గొన్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న మూడేళ్ల ప‌రిపాల‌న ఏంటో అంద‌రూ చూస్తున్న‌దే. ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. “గోడు విన‌వ‌య్యా” జ‌గ‌న్ అనేవాళ్లే ఎక్కువ‌. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు మాత్రం భేష్ అని జ‌నం అంటున్నారు. మిగిలిన విష‌యాల్లో అసంతృప్తి వుంద‌నేది నిజం. అయితే సంక్షేమ బాటే త‌మ ప్ర‌భుత్వ విధాన‌మ‌ని ముఖ్య‌మంత్రి, మంత్రులు తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించాల‌నుకోవ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌జ‌ల‌కు చేరువ‌లో ఉంటార‌ని అప్ప‌ట్లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై ప్ర‌శంస‌లు కురిపించేవారు. వైఎస్ జ‌గ‌న్‌పై అందుకు భిన్న‌మైన ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్ష నేత‌గా నిత్యం జ‌నంలో ఉన్న జ‌గ‌న్‌, సీఎం అయిన త‌ర్వాత దూర‌మ‌య్యార‌నే విమ‌ర్శ వుంది. క‌నీసం ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు కూడా ఆయ‌న అపాయింట్‌మెంట్ దొర‌క‌డం లేద‌నే విమ‌ర్శ ఇటీవ‌లి కాలం వ‌ర‌కూ ఉండింది. ఇప్పుడిప్పుడే ఆయ‌న ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు త‌రచూ అపాయింట్‌మెంట్స్ ఇస్తూ వారి స‌మ‌స్య‌ల‌ను వింటున్నారు.

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లున్న నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు ప్ర‌జాద‌ర్బార్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో ఇక మీద‌ట వారంలో ఐదు రోజుల పాటు ఆయ‌న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను విన‌నున్నారు.

త్వ‌ర‌లోనే ప్ర‌జాద‌ర్బార్ చేప‌ట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. ఆల‌స్యంగానైనా ప్ర‌జ‌ల నుంచి విన‌తిప‌త్రాలు స్వీక‌రించేందుకు సీఎం నిర్ణ‌యించ‌డం పార్టీకి శుభ‌సూచిక‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. తాము చెప్ప‌డం కంటే, నేరుగా సీఎం ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటే ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.