తెలంగాణ‌కు వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాలో కోత‌!

రాష్ట్రాల‌కు కేంద్రం అందించే ఉచిత క‌రోనా వ్యాక్సిన్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌రిశీలిస్తే… తెలంగాణ‌కు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్ల‌లో కోత విధించే అవ‌కాశాలున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది.…

రాష్ట్రాల‌కు కేంద్రం అందించే ఉచిత క‌రోనా వ్యాక్సిన్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం విడుదల చేసింది. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌రిశీలిస్తే… తెలంగాణ‌కు స‌ర‌ఫ‌రా చేసే వ్యాక్సిన్ల‌లో కోత విధించే అవ‌కాశాలున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ప్ర‌ధానంగా కేంద్రం అందించే ఉచిత టీకా డోసుల‌ను జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు కేటాయించ నున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జాతీయ వ్యాక్సినేషన్‌ విధానంపై మంగళవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ సమర్థంగా చేపడుతున్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. అలాగే టీకాల వృథా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేటాయింపుల్లో కోత ఉండొచ్చని హెచ్చ రించింది.  

ఈ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఏ ర‌కంగా చూసినా తెలంగాణ‌కు త‌క్కువ స‌ర‌ఫ‌రా చేసే అవ‌కాశం ఉంద‌నేది బ‌ల‌మైన వాద‌న. ఎందుకంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌తో పోల్చుకుంటే జ‌నాభా ప‌రంగా తెలంగాణ‌లో త‌క్కువ‌. మ‌రీ ముఖ్యంగా క‌రోనా కేసుల సంఖ్య ఆంధ్రాతో పోల్చుకుంటే స‌గానికి స‌గం కూడా న‌మోదు కాలేదు. అయితే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు త‌క్కువ చేయ‌డంతో పాటు, త‌క్కువ పాజిటివిటీ కేసుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం చూపుతోంద‌ని ఆ రాష్ట్ర హైకోర్టు అనేక‌మార్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అంటే తెలంగాణ‌లో త‌క్కువ కేసులు న‌మోదు అవుతున్న దృష్ట్యా, అక్క‌డ క‌రోనా పెద్ద‌గా లేక‌పోవ‌డంతో వ్యాక్సిన్ కూడా త‌క్కువ పంపే అవ‌కాశం ఉంది. ఇక టీకాల‌ను వృథా చేసిన రాష్ట్రాల‌కు కూడా స‌ర‌ఫ‌రాలో కోత విధిస్తామ‌నే హెచ్చ‌రిక నేప‌థ్యంలో కూడా, తెలంగాణ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఎందుకంటే రెండురోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో టీకాల వృథా గురించి స్ప‌ష్టంగా పేర్కొంది.

ఆ వృథా జాబితాలో తెలంగాణ కూడా చోటు చేసుకుంది. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌కారం… పంజాబ్‌లో 1.43 ల‌క్ష‌లు, ఛ‌త్తీస్ గ‌ఢ్‌లో 1.55 ల‌క్ష‌లు, తెలంగాణ‌లో 2.25 ల‌క్ష‌లు, రాజ‌స్థాన్‌లో 4.76 ల‌క్ష‌లు, కేర‌ళ‌లో 6.33 ల‌క్ష‌ల డోసుల టీకా వృథా అయింది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి వ్యాక్సిన్య విష‌యంలో త‌క్కువ స‌ర‌ఫ‌రా కావ‌చ్చేనేందుకు ఈ లెక్క‌ల‌న్నీ ముందుకొస్తున్నాయి.  మ‌రి ఇది అమ‌ల‌య్యే నాటికి ఎలాంటి లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో చూడాలి.