జ‌గ‌న్ ‘ఊ’ కొడ‌తారా?‘ఊహూ’ అంటారా!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏం చేసినా, చేయ‌క‌పోయినా చ‌ర్చో, ర‌చ్చో జ‌రిగి తీరాల్సిందే. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన వేళావిశేషం ఏంటో తెలియ‌దు కానీ, ప్ర‌తిదీ వివాదాస్ప‌దం అవుతోంది. చివ‌రికి నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఏం చేసినా, చేయ‌క‌పోయినా చ‌ర్చో, ర‌చ్చో జ‌రిగి తీరాల్సిందే. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన వేళావిశేషం ఏంటో తెలియ‌దు కానీ, ప్ర‌తిదీ వివాదాస్ప‌దం అవుతోంది. చివ‌రికి నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేస్తున్న ఆయుర్వేద మందును కూడా ప్ర‌త్య‌ర్థులు విడిచి పెట్ట‌డం లేదు. 

క‌రోనా క‌ట్ట‌డికి ఆనంద‌య్య మందు ప‌నిచేస్తుంద‌ని, కార్పొరేట్ ఆస్ప‌త్రుల ఒత్తిడితోనే ఆనంద‌య్య మందు పంపిణీని ప్ర‌భుత్వం అడ్డుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం చేయ‌డం, దాని అనుకూల మీడియా గంట‌ల త‌రబ‌డి డిబేట్లు నిర్వ‌హిస్తుండ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎట్ట‌కేల‌కు ఆనంద‌య్య మందు పంపిణీ ప్ర‌క్రియ స్టార్ట్ అయ్యింది.

ఇదే స‌మ‌యంలో త‌న మందు పంపిణీకి ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఆనంద‌య్య తాజాగా ఓ లేఖ రాశారు. ఒక్కో జిల్లాకి అయిదు వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం ద్వారా పంపిణీ‌ చేయించాలని ఆనందయ్య కోరారు. 

అలాగే ఔషదం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని కోరారు. ఎక్కువ మొత్తంలో మందు తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు.

ఆనంద‌య్య విజ్ఞ‌ప్తిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందిస్తే స‌రేస‌రి! స్పందించక‌పోతే మాత్రం మ‌రోసారి వివాదాన్ని సృష్టించేం దుకు ఎల్లో గ్యాంగ్ కాచుకుని ఉంది. ప్రజ‌ల‌కు ఎంతో ప్ర‌యోజ‌న‌కారిగా ఉన్న క‌రోనా మందును పంపిణీ చేసేందుకు స‌హ‌క‌రించ లేదంటే ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వంగా ముద్ర వేయ‌డానికి ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా సిద్ధంగా ఉన్నాయి. 

ప్రైవేట్‌, కార్పొరేట్ ఆస్ప‌త్రుల ఒత్తిడి మేర‌కే ఆనంద‌య్య‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తోంద‌నే ప్ర‌చారాన్ని తెర‌పైకి తీసుకొచ్చేందుకు అస్త్రాల‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఆనంద‌య్య విజ్ఞ‌ప్తిపై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‘ఊ’ కొడ‌తారా లేక ‘ఊహూ’ అంటారా? అనేది ఉత్కంఠ రేపుతోంది.