దర్శకుడు మారుతి ఓటీటీ డెబ్యూ పక్కా అయింది. రీసెంట్ గా ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంతోష్ శోభన్ ను హీరోగా పెట్టి ఓ చిన్న సినిమా చేస్తున్నాడు మారుతి. దర్శకుడిగా మారుతికి ఇదే తొలి ఓటీటీ సినిమా. మారుతి ఇలా ఉన్నఫలంగా ఓటీటీ డెబ్యూ ఇవ్వడానికి ప్రధాన కారణం అల్లు అరవింద్ అని తెలుస్తోంది.
'ఆహా'ను క్లిక్ చేసేందుకు అల్లు అరవింద్ కిందామీద పడుతున్నారు. ఒరిజినల్ కంటెంట్ విషయంలో ఇప్పటికే చాలా ఎదురుదెబ్బలు తిన్న ఈ సంస్థ, సినిమాల విషయంలో కూడా అమెజాన్ కు పోటీ ఇవ్వలేకపోతోంది. రీసెంట్ గా క్రాక్ సినిమా తప్ప ఈ యాప్ కు పెద్దగా కలిసొచ్చిన మూవీ లేదు.
గాలి సంపత్, చావు కబురు చల్లగా, తెల్లవారితే గురువారం లాంటి సినిమాలతో పాటు వరుసపెట్టి వచ్చిన మలయాళం డబ్బింగ్ సినిమాలు ఆహాకు ఎలాంటి ఉపకారం చేయలేదు. ఇలాంటి టైమ్ లో మారుతిని రంగంలోకి దించాడట అల్లు అరవింద్.
లాక్ డౌన్ టైమ్ లో చాలా స్టోరీలైన్స్ రాసుకున్నాడు మారుతి. అందులో ఒకటి ఓటీటీకి పనికొచ్చే స్టఫ్. సరదాగా సాగిపోయే ఆ కాన్సెప్ట్ తోనే సంతోష్ శోభన్ హీరోగా సినిమా రెడీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. జస్ట్ 30 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. మెహ్రీన్ ఇందులో హీరోయిన్.
ప్రస్తుతం మారుతి చేతిలో ''పక్కా కమర్షియల్'' అనే సినిమా ఉంది. గోపీచంద్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. అది మళ్లీ సెట్స్ పైకి వచ్చేలోపు, ఈ ఓటీటీ మూవీని పూర్తిచేయాలనేది మారుతి ఆలోచన.