జ‌గ‌న్ మేన‌మామ ‘ఆనందానికి’ బ్రేక్‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముద్దుల మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ‘ఆనందానికి’ ఆదిలోనే బ్రేక్ ప‌డింది. క‌రోనా సెకెండ్ వేవ్ మ‌న వ్య‌వ‌స్థ‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌స్తుతం త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు రోజువారీ పాజిటివ్ కేసులు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ముద్దుల మేన‌మామ‌, క‌మ‌లాపురం ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ‘ఆనందానికి’ ఆదిలోనే బ్రేక్ ప‌డింది. క‌రోనా సెకెండ్ వేవ్ మ‌న వ్య‌వ‌స్థ‌ను అత‌లాకుత‌లం చేస్తోంది. ప్ర‌స్తుతం త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్టు రోజువారీ పాజిటివ్ కేసులు చెబుతున్నా, వారం ప‌ది రోజుల క్రితం వ‌ర‌కు ఆక్సిజ‌న్‌, బెడ్ దొర‌క్క నానా తిప్ప‌లు ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణ‌పట్నం నివాసి ఆనంద‌య్య త‌యారు చేసే ఆయుర్వేద మందు క‌రోనాకు బాగా ప‌ని చేస్తుంద‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. దీంతో పోలోమ‌ని అక్క‌డికి జ‌నం క్యూ క‌ట్టారు.

ప‌లు ప‌రిశోధ‌న‌ల అనంత‌రం కంటి డ్రాప్స్ మిన‌హాయించి మిగిలిన మందులు పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. మ‌రోవైపు ప్రాంతాలు, భాష‌ల‌కు అతీతంగా ఆనంద‌య్య మందుకు డిమాండ్ ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఆనంద‌య్య మందు త‌యారీకి ముందుకొచ్చారు.

ఆనంద‌య్య కుమారుడు శ్రీ‌ధ‌ర్‌, శిష్యుల స‌హ‌కారంతో మందు త‌యారీని చెవిరెడ్డి ప్రారంభించారు. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్‌ ఫంగస్‌ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్‌ (పి) మందు మాత్రమే చంద్ర‌గిరిలో త‌యారు చేస్తున్న‌ట్టు చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. త‌న నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును ఉచితంగా పంపిణీ చేసేందుకు చెవిరెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు.

జ‌నంలో ఆనంద‌య్య మందుకున్న డిమాండ్‌ను ప‌సిగ‌ట్టిన అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు చెవిరెడ్డి మాదిరిగా త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌యారు చేయించి ఉచితంగా పంపిణీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం ఎమ్మెల్యే, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కూడా ఆనంద‌య్య మందును త‌యారు చేయించి, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పంపిణీ చేసేందుకు ఉత్సాహం చూపారు.

ఆనంద‌య్య శిష్యుడంటూ ముందుకొచ్చిన ఓ వ్య‌క్తితో మందు తయారీకి సిద్ధ‌మ‌వుతున్న విష‌యమై మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారమైంది. ఈ విష‌య‌మై ఆనంద‌య్య స్పందిస్తూ త‌న పేరుతో క‌డ‌ప‌లో త‌యారు చేస్తున్న మందుకు, త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ప్ర‌క‌టించారు. ఆ మందు వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తే త‌న‌కు సంబంధం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో ఆనంద‌య్య శిష్యుడిగా చెప్పుకునే వ్య‌క్తితో మందు త‌యారీని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి నిలుపుద‌ల చేశారు. దీంతో ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డిలో ఉత్సాహం ఒక్క‌సారిగా నీరుగారిపోయింది.