జీవితమంతా సత్యం కోసం బతికి యావత్ ప్రపంచ దృష్టిని భారత జాతిపిత మహాత్మాగాంధీ ఆకర్షించారు. గాంధీ పేరు వింటే చాలు ఓ ఆరాధన భావం కలుగుతుంది. అలాంటి మహనీయుడి వంశంలో పుట్టిన వ్యక్తి తప్పుడు కేసులో ఏడేళ్ల జైలు శిక్షకు గురి కావడం నివ్వెరపరుస్తోంది. ఇది దక్షిణాప్రికాలో చోటు చేసుకుంది. మహాత్మాగాంధీ మునిమనవరాలు ఆశిష్ లతా రాంగోబిన్ దక్షిణాఫ్రికాలో మోసం, ఫోర్జరీ కేసులో దోషిగా తేలారు. దీంతో అక్కడి న్యాయస్థానం ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
“దైవం ఎక్కడో లేడు… సత్యంలో కొలువై ఉన్నాడు. అసలు సత్యమే దైవం. ప్రతి మనిషీ సత్యానికి బద్ధుడు” ఇదీ.. .మహాత్ముడి ఉద్బోధ. ఆయన కేవలం ఉపన్యాసాలతో సరిపెట్టలేదు. ఆచరించి ఆదర్శంగా నిలిచారు. దేవుడే సత్యం అన్నది సరికాదని, సత్యమే దేవుడని నిజం అనేదానికి కొత్త భాష్యం చెప్పారాయన. అలాంటి మహానుభావుడి రక్తం పంచుకుని పుట్టిన కుటుం బంలో, ఆయన సిద్ధాంతాలకు విరుద్ధంగా నడుచుకుని జైలు బాట పట్టాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే…
ఈలా గాంధీ …గాంధీజీ మనవరాలు. దక్షిణాప్రికాలో సెటిల్ అయ్యారు. ఈమె ఆ దేశంలో మానవ హక్కుల కార్యకర్త. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ప్రజల కోసం జీవితాన్ని అర్పించుకున్నారు. ఈమె కూతురే లతా రాంగోబిన్. అహింసపై ఏర్పాటైన ఓ స్వచ్ఛంద సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈమె పర్యావరణ హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు. అయితే ఎందుకో డబ్బు సంపాదన ఆమెలో చెడు ఆలోచనలకు దారి తీసింది. 2015లో భారత్ నుంచి లినెన్ వస్త్రాలతో ఉన్న కంటైనర్లు తెప్పిస్తున్నానంటూ ఓ వ్యాపారిని నకిలీ పత్రాలతో మోసం చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదైంది.
దక్షిణాఫ్రికాకు చెందిన న్యూ ఆఫ్రికా అలియన్స్ ఫూట్‌వేర్ డిస్ట్రిబ్యూటర్ స్థానికంగా వస్త్రాలు, చెప్పుల వ్యాపారం చేస్తుంటుంది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎస్ఆర్ మహరాజ్‌ను 2015 ఆగస్టులో లతా రాంగోబిన్ కలిశారు. దక్షిణాఫ్రికా హాస్పిటల్ గ్రూప్ నెట్‌కేర్ కోసం తాను భారత్ నుంచి మూడు లినెన్ కంటైనర్లను దిగుమతి చేసుకున్నానని, అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కస్టమ్స్ సుంకాలు చెల్లించలేకపోతున్నానని నమ్మబలికారు.
హార్బర్‌లో ఉన్న కంటైనర్లను తెచ్చుకునేందుకు కొంత డబ్బు సాయం కావాలని అడిగారు. ఆర్థిక సాయం చేస్తే…. తన లాభాల్లో షేర్ ఇస్తానని హామీ ఇచ్చారు. లినెన్ ఉత్పత్తులను ఆర్డర్ చేసినట్లుగా కొన్ని పత్రాలు, ఇన్‌వాయిస్‌లు ప్రూఫ్‌లుగా చూపించారు.
లతా రాంగోబిన్ కుటుంబ నేపథ్యం, హక్కుల కార్యకర్తగా గుర్తింపు తదితర అంశాలు ఆమెకు అప్పు ఇచ్చేందుకు పనికొచ్చాయి. లతా రాంగోబిన్‌కు సదరు వ్యాపారి మహరాజ్ 6.2 మిలియన్ రాండ్ల నగదు అందజేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత తాను మోసపోయినట్టు సదరు వ్యాపారి గుర్తించారు. లతా చూపించిన పత్రాలు నకిలీవని, భారత్ నుంచి ఎలాంటి దిగుమతులు చేసుకోలేదని మహరాజ్‌కు తెలిసింది.
దీంతో లతా రాంగోబిన్‌పై 2015లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉంటున్నారు. తాజాగా తుది విచారణ జరిపిన డర్బన్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ కేసులో లతా రాంగోబిన్‌ను దోషిగా తేలుస్తూ 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. తీర్పు, శిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని కోర్టు తేల్చి చెప్పడం గమనార్హం. ప్రపంచమే దైవంగా కొలిచే మహాత్ముడి మునిమనవరాలికి జైలు శిక్ష పడిందనే సమాచారం భారతీయుల్ని తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది.