అసలే ఈమధ్య చేసిన ఏ సినిమా క్లిక్ అవకపోవడంతో నాగచైతన్య మార్కెట్‌పై ప్రభావం పడింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో అతనికి ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. త్వరలో విడుదల కానున్న మజిలీ చిత్రంపై చైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. మంచి ముహూర్తం చూసుకుని, వేసవిలో తొలి పెద్ద సినిమా అవుతుందని భావించి ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు.
కానీ ఎన్నికల షెడ్యూల్ వల్ల మజిలీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఏప్రిల్ 11న ఎన్నికలు కనుక జనమంతా ఎన్నికల మూడ్‌లో వుంటారు. సాధారణంగా ఎలక్షన్స్ టైమ్‌లో విడుదలయ్యే సినిమాలకి అంతగా ఆదరణ వుండదు. క్రికెట్ మ్యాచ్‌ల కంటే కూడా ఎలక్షన్ల ప్రభావం ఎక్కువ వుంటుందనేది చాలాసార్లు రుజువయింది. మరి ఈ చిత్రాన్ని మరో డేట్‌కి వాయిదా వేస్తారా?
ఏప్రిల్ 5 కాకుంటే మరో సినిమాతో క్లాష్ లేకుండా విడుదల చేసుకోవడానికి వీల్లేదు. ఏప్రిల్ 12 నుంచి ప్రతి శుక్రవారం ఏదో ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది. మరి మరో చిత్రంతో క్లాష్‌కే సిద్ధపడతారా లేక రిస్క్ తీసుకుని ఎన్నికల వేడి తీవ్రంగా వున్న సమయంలోనే విడుదల చేస్తారా అనేది చూడాలి. ఇప్పటివరకు అయితే రిలీజ్ డేట్‌లో మార్పులున్నాయనే సమాచారమేదీ అందలేదు.