పిల్ల‌ల్లో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే…!

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై పంజా విసురుతుంద‌నే హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ ఎక్కువ ప్రాణ న‌ష్టం క‌లిగించింది. సెకెండ్ వేవ్ దుష్ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే…

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై పంజా విసురుతుంద‌నే హెచ్చ‌రిక‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ ఎక్కువ ప్రాణ న‌ష్టం క‌లిగించింది. సెకెండ్ వేవ్ దుష్ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్రాణ న‌ష్టంతో పాటు వైద్యానికి ల‌క్ష‌లాది రూపాయ‌లు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌చ్చింది. క‌రోనా నుంచి కోలుకున్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎప్పుడు బ‌య‌ప‌డ‌తారో, ఎంత కాలం ప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

క‌రోనా ఫ‌స్ట్, సెకెండ్ వేవ్‌ల నుంచి ప్ర‌జానీకం గుణ‌పాఠం నేర్చుకుని, థ‌ర్డ్ వేవ్ ముప్పు నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంది. థ‌ర్డ్ వేవ్‌కు ఏకైక మందు ఇంటి నుంచి బ‌య‌ట‌కు క‌ద‌ల‌క‌పోవ‌డ‌మే. ఎంతో అవ‌స‌రం ఉంటే, అది కూడా అన్ని జాగ్ర‌త్త‌ల‌తో ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లాలి. ఈ నేప‌థ్యంలో థ‌ర్డ్ వేవ్‌లో క‌రోనా బారిన ప‌డ్డ పిల్ల వాళ్ల‌లో ఎలాంటి ల‌క్ష‌ణాలుంటాయ‌నే దానిపై వైద్య నిపుణులు ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నారు.

వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ) బయోటెక్నాలజీ సహాయ ఆచార్యుడు పెరుగు శ్యాం థ‌ర్డ్ వేవ్‌పై క‌ల్పిస్తున్న అవ‌గాహ‌న‌, హెచ్చ‌రిక‌లు అమూల్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కరోనా మూడో దశలో హైబ్రిడ్‌ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తమ అధ్యయనంలో వెల్లడైందని పెరుగు శ్యాం వెల్లడించారు. కొవిడ్‌ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్లే రకరకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు.

వైరస్‌ మ్యుటేషన్లు పెరగడంతో మొదటి దశ కన్నా రెండో దశలో ఎక్కువ ప్రభావం చూపుతోందన్నారు. త్వరలో మూడో ముప్పు పొంచి ఉందని, వైరస్‌ పలు రూపాంతరాల తర్వాత హైబ్రిడ్‌ వేరియంట్గా మారుతుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీనిని ‘బి.1.617.2’ వేరియంట్గా పిలుస్తున్నారన్నారు. ఈ వైర‌స్ 13 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చ‌రించారు. ముఖ్యంగా ఈ వైర‌స్ బారిన పిల్ల‌ల ల‌క్ష‌ణాల‌ను ఆయ‌న తెలిపారు.

శరీరంపై దద్దుర్లు, కళ్లకింద మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు లాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉందన్నారు. రానున్న వర్షాకాలంలో పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, డయేరియా బారిన పడే ప్రమాదం ఉన్నందున త‌ల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

రెండో వేవ్‌లో కేసులు తగ్గాయ‌ని బ‌య‌ట‌కు వెళ్ల‌డం, జ‌నంలో క‌ల‌వ‌డం లాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. వ‌ర్షాకాలం మొద‌లైన నేప‌థ్యంలో పిల్ల‌ల్లో పైన పేర్కొన్న ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే చాలు, వెంట‌నే త‌ల్లిదండ్రులు త‌గిన వైద్య ప‌రిర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంది. అప్పుడే ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న పిల్ల‌ల్ని కాపాడుకోగ‌లుగుతాం.