ఫ్యామిలీ మేన్ సీజన్-2తో మరో అద్భుతమైన విజయాన్నందుకున్నాడు నటుడు మనోజ్ బాజ్ పాయ్. ఈ విజయం తనకు కొత్తతరం ఫ్యాన్ బేస్ ను అందించిందని చెబుతున్న మనోజ్.. ఓటీటీవైపు చూస్తున్న నటుల కోసం ఓ మంచి సలహా ఇచ్చాడు.
“ఓ నటుడికి తనను తాను అన్వేషించుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఓటీటీ చాలా అవకాశం ఇస్తుంది. డిజిటల్ మీడియా, డిజిటల్ ప్రేక్షకులు ప్రయోగాలు కోరుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మార్చుకోకపోతే దయచేసి ఓటీటీకి రావొద్దు.”
ఇలా ఓటీటీ వైపు చూస్తున్న నటులకు చక్కటి సలహా ఇచ్చాడు మనోజ్ బాజ్ పాయ్. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన ఈ నటుడు, ''ఫ్యామిలీ మేన్''లో శ్రీకాంత్ తివారి పాత్రలో ఒదిగిపోయాడు. ఓవైపు ఫ్యామిలీ స్ట్రగుల్, మరోవైపు వృత్తి బాధ్యతల మధ్య నలిగిపోయే సగటు మనిషిగా అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
“ఇప్పుడున్న కొత్త తరానికి ఓటీటీ నన్ను పరిచయం చేసింది. ఇప్పటి తరానికి గతంలో నేను చేసిన సినిమాలు తెలియవు. వాళ్లకు తెలిసింది శ్రీకాంత్ తివారీ మాత్రమే. ఇప్పుడు 15-16 ఏళ్ల పిల్లలు నా దగ్గరకొచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ వయసు ఫ్యాన్స్ గతంలో నాకు లేరు. అలా ఫ్యామిలీ మేన్ సిరీస్ నాకు ఓ కొత్త ఫ్యాన్ బేస్ ఇచ్చింది.”
సినిమాలో రాజి పాత్రలో నటించిన సమంతను పొగడ్తల్లో ముంచెత్తాడు మనోజ్ బాజ్ పాయ్. తనకంటే బాగా సమంత నటించిందని మెచ్చుకున్న బాజ్ పాయ్.. ఈ షో కోసం సమంత చేసిన హార్డ్ వర్క్ చూసి మెస్మరైజ్ అయ్యానని చెప్పుకొచ్చాడు. సీజన్-3 పై స్పందిస్తూ.. తన మైండ్ లో ఏమీ లేదని, దర్శకులు ఇంకా తనతో ఆ విషయం చర్చించలేదని చెప్పుకొచ్చాడు మనోజ్ బాజ్ పాయ్.