నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎంత లౌక్యుడో ఆయన చేస్తున్న ఫిర్యాదులు, విన్నపాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా మోదీ సర్కార్ విషయంలో చాలా భయభక్తులతో వ్యవహరించడం కళ్లకు కడుతోంది.
పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదని అనుకుంటుందట. రఘురామకృష్ణంరాజు తన కేసు విషయంలో చేస్తున్న అల్లరి కూడా అలాంటిదే. రాజద్రోహం (124-ఏ) కేసును రద్దు చేయాల్సిన వాళ్లకు కాకుండా, మిగిలిన వారందరికీ లేఖలు రాయడంలో ఆయన కుట్రపూరిత ఆలోచనలు బయటపడుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
రాజద్రోహం (124-ఏ) కేసు చరిత్ర ఈనాటిది కాదు. అది బ్రిటీష్ హయాంలో ఆంగ్లేయులు ప్రవేశ పెట్టారు. ఆంగ్లేయుల పాలన పోయినా అప్రజాస్వామిక కేసు అవశేషాలు మాత్రం చట్టంలో మిగిలిపోయాయి. దాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సి వుంది. కాంగ్రెస్ పోయి, బీజేపీ అధికారంలోకి వచ్చినా, రాజద్రోహం మాత్రం వెలిగిపోతోంది.
మోదీ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలపై ఇటీవల పెద్ద సంఖ్యలో రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి. తన పాలనపై నిరసన గళం వినిపించే వారిని అణచివేయడానికి రాజద్రోహం అస్త్రాన్ని కేంద్రం ప్రయోగిస్తోంది.
ఈ కేసులో వందలాది మంది అరెస్ట్ అయి కనీసం బెయిల్‌కు కూడా నోచుకోలేదు. ఈ విషయంలో రఘురామకృష్ణంరాజు చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. రఘురామ సరే, మిగిలిన వారి బెయిల్ మాటేంటనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, రఘురామ మాత్రం తనొక్కడిపై ఏపీ ప్రభుత్వం ఎన్నడూ, ఎప్పుడూ చూడని సెక్షన్ల కింద కేసు కట్టారని రాద్ధాంతం చేస్తున్నారు. అయితే రాజద్రోహం కింద కేసు ఎవరు నమోదు చేసినా వ్యతిరేకించాల్సిందేనని, నిజంగా రఘురామకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వైఖరి గురించి నామ మాత్రం గా కూడా ఎందుకు ప్రస్తావించలేదనే ప్రశ్నలు, నిలదీతలు వెల్లువెత్తుతున్నాయి.
అలాగే రాజద్రోహం కేసును చట్టం నుంచి ఎత్తే యాల్సిన కేంద్రంపై పోరాడకుండా, కేవలం జగన్ సర్కార్‌పై మాత్రమే దేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రులకు, ఎంపీలకు లేఖలు రాయడం ద్వారా రఘురామ తన నిజస్వరూపం ఏంటో చెప్పకనే చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రాజద్రోహం (124-ఏ) కేసును చట్టం నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి రఘురామ లేఖ ఎందుకు రాయలేదనే వాదన తెరపైకి వస్తోంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు. రాజద్రోహం గురించే తన ఆవేదన అయితే జగన్ కేసుల ప్రస్తావన ఎందుకనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
రాజద్రోహం ఎత్తివేతకు మద్దతు కోరే నెపంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు అప్రస్తుత, అసందర్భ అంశాలను తన లేఖలో ప్రస్తావించడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దేశమందరికీ చెప్పడం వల్ల ఒరిగేదేమీ ఉండదని, దానిపై న్యాయస్థానాల్లో తప్ప, మరెక్కడా న్యాయం జరగదని తెలిసి కూడా సానుభూతి పొందేందుకు ఛీప్ ట్రిక్స్‌కు రఘురామ పాల్పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామకృష్ణం రాజు నుంచి ఉన్నత విలువలు ఆశించడం అత్యాశే అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.