కరోనా కష్టకాలంలో దేశానికి 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రపంచంలో మరే ఇతర దేశమూచేయని సాహసం చేశారు. తీరా ఆ 20 లక్షల కోట్ల లెక్కలు చెప్పే సరికి ఇంత చెత్త ప్యాకేజీ భారతదేశ చరిత్రలోనే లేదనే విమర్శలు వినిపించాయి. ఆ ప్యాకేజీ కింద ఎంత మందికి లబ్ది చేకూరింది, ఎంతమంది పేదల కడుపు నిండిందనేది ఇప్పటికీ ఓ బ్రహ్మపదార్థం.
ఇప్పుడు అదే ప్రధాని.. 18ఏళ్లు నిండిన భారత ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి గతంలో కూడా ఇండియాలో వ్యాక్సిన్ ఫ్రీ అని కేంద్ర మంత్రులు పదే పదే చెప్పారు. ఇప్పుడు మరోసారి మోదీ ఆ హామీ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటి..? రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటున్న మోదీ నిజంగానే వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వగలరా..? అసలు ఇన్నాళ్లూ లేనిది మోదీకి ఇప్పుడే ఎందుకు జ్ఞానోదయమైంది?
ప్రైవేటుకి ఎందుకు..?
“ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుంది, నవంబర్ నెలకల్లా దేశ జనాభాలో 80శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుంది.” ఇవీ మోదీ చెప్పిన మాటలు. ప్రభుత్వమే వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుంటే ఇక ప్రైవేటులో ఎందుకు? ప్రైవేటు సరఫరా వల్ల ప్రభుత్వం టీకా పంపిణీ చేయడంలో ఆలస్యం అవుతుంది కదా..? విదేశాలకు వెళ్లేవారికి, ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే టీకాలిస్తే కాదనేవారెవరు? ప్రైవేటు ఆస్పత్రులకి కూడా గేట్లు బార్లా తెరిస్తే ఇక ప్రభుత్వం ఖర్చు చేసేది ఎంతో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం దేశంలో టీకా పంపిణీ నత్తనడకన జరుగుతోందనే విషయం వాస్తవం. అవసరానికి తగినట్టు టీకాలు సరఫరా చేయలేకపోతోందంటూ కేంద్రంపై రాష్ట్రాలు ధ్వజమెత్తుతున్న వేళ, ఆ ఆగ్రహ జ్వాలల్ని చల్లార్చేందుకు రంగంలోకి దిగిన మోదీ ''ఉచిత'' హామీ ఇచ్చారు. రాష్ట్రాలు రూపాయి ఖర్చు చేయక్కర్లేదంటూ ఊదరగొట్టారు.
ఇప్పుడున్న స్పీడ్ ప్రకారం వ్యాక్సినేషన్ కొనసాగితే 2022 చివరి నాటికి కూడా టీకా పంపిణీ పూర్తయ్యే అవకాశం లేదు. మరి మన మోదీ మరో ఆరు నెలల్లో 80శాతం మందికి టీకా ఇస్తామంటున్నారు, ఏడాది చివరికల్లా భారత జనాభా అంతటికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని ఐసీఎంఆర్ చెబుతోంది. అసలీ మాటల్ని నమ్మొచ్చా..?
కరోనా ప్యాకేజీలా అవ్వకుంటే చాలు
20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎటుపోయిందని రాష్ట్రాలేవీ కేంద్రాన్ని నిలదీయలేదు. ఒకవేళ నిలదీసినా.. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ విషయంలో ఏం జరుగుతోందో అందరికీ తెలిసిందే. నిధుల లెక్కలు చెప్పకపోగా ఎదురుదాడికి దిగడం 'కమల'కు అలవాటే. రేపు టీకా పంపిణీ పూర్తి కాకపోయినా మోదీని ఎవరూ తప్పుబట్టే సాహసం చేయరు. ఆ నెపాన్ని ఎంచక్కా రాష్ట్రాలపై నెట్టేందుకు ఆయన వద్ద అస్త్ర శస్త్రాలు, జాతీయ మీడియా అండదండలు పుష్కలంగా ఉంటాయి.
20 లక్షల కరోనా ప్యాకేజీ ప్రకటించిన తర్వాత నిర్మలమ్మ చెప్పిన లెక్కలకు అంతా షాకయ్యారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీలోని 6 లక్షల కోట్ల వాటా వివరాలు వివరించారు. దీనికితోడు గతంలో ప్రకటించిన గరీబ్ కల్యాణ్ యోజన 1.70లక్షల కోట్లట. రిజర్వ్ బ్యాంక్ ఉద్దీపన 5.24 లక్షల కోట్లు కూడా ఇందులో భాగమేనట, దీనికి 6లక్షల కోట్లు కలుపుకుంటే మొత్తం 12.88లక్షల కోట్లు ఇప్పటికే వచ్చేసినట్టు. ఇక ప్రకటించబోయేది కేవలం 7.12 లక్షల కోట్ల వివరాలన్నారు. వాటికి కూడా సరైన లెక్కలు చెప్పలేదు.
ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో కూడా ఆల్రెడీ టీకా తీసుకున్నవాళ్లను, ప్రైవేటులో డబ్బులు కట్టి తీసుకున్న జనాల్ని కూడా తమ ఖాతాలో వేసి ఇప్పటికే 40శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని మోదీ చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. గతంలో జరిగిన పలు వీడియో కాన్ఫరెన్స్ ల్లో వ్యాక్సిన్ వృథా అంటూ రాష్ట్రాలపై నిందలు మోపిన మోదీ.. మరోసారి తన మార్కు జిమ్మిక్కులతో, అంకెల గారడీతో తో వ్యాక్సిన్ ను ఉచితంగా వేశామని చెప్పుకుంటే అందులో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే 20 లక్షల కోట్ల ప్యాకేజీ గారడీ ముందు ఈ ఉచిత వ్యాక్సిన్ హామీ అనేది జుజుబీ.