ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కరోనా గణాంకాలు వింటుంటే ఇది కలా? నిజమా? అనే ప్రశ్న ఎవరికి వాళ్లు వేసుకునే పరిస్థితి. ఎందుకంటే గత రెండు నెలలుగా కరోనా కేసులు అంతకంతకూ పెరగడమే తప్ప, తగ్గడమనే మాట వినని ఆంధ్రా ప్రజానీకానికి ఇది గొప్ప ఊరటనిచ్చే సమాచారం.
గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 4,872 మందికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణైంది. అది కూడా 64,800 మందికి పరీక్షలు చేయగా నమోదైన కేసులవి. గత రెండు నెలల్లో అత్యంత తక్కువగా నమోదైన కేసులుగా రికార్డులు చెబుతున్నాయి.
ఇందులో కూడా మరో ఆనందించాల్సిన విషయం ఉంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 961 కేసులున్నాయి. అంటే దాదాపు 25% కేసులు ఒక్క జిల్లాలోనే నిర్ధారణ అయ్యాయన్న మాట. మిగిలిన 12 జిల్లాల్లో నామమాత్రపు కేసులు నమోదవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలు ఉండడం, అక్కడికి వివిధ రకాల పర్యాటకులు, భక్తులు వచ్చే విషయం అందరికీ తెలిసిందే.
ఆ ఒక్క జిల్లాలో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడితే, కరోనా సెకెండ్ వేవ్ దాదాపు అదులోకి వచ్చినట్టే. అలాగని అజాగ్రత్తగా ఉంటే మాత్రం ముప్పు తప్పదు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏ మాత్రం రిలాక్స్ అయినా, కరోనా సెకెండ్ వేవ్ కష్టాలు పునరావృతం అవుతాయని హెచ్చరించక తప్పదు.