యూపీ.. రేప్ చేసి, పోలీసుల‌పై కాల్పులు జ‌రిపిన కుర్రాళ్లు!

యోగి రాజ్యంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పే మ‌రో సంఘ‌ట‌న ఇది. కేవ‌లం ఒక రాష్ట్రంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌గా కాకుండా, ఇండియాలో ఇలాంటి స్థాయిలో ప‌రిస్థితులున్నాయా.. అని భార‌తీయులు తెలుసుకుని విస్మ‌యం…

యోగి రాజ్యంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఏ స్థాయిలో ఉన్నాయో చాటి చెప్పే మ‌రో సంఘ‌ట‌న ఇది. కేవ‌లం ఒక రాష్ట్రంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌గా కాకుండా, ఇండియాలో ఇలాంటి స్థాయిలో ప‌రిస్థితులున్నాయా.. అని భార‌తీయులు తెలుసుకుని విస్మ‌యం చెందాల్సిన సంఘ‌ట‌న ఇది. 20 యేళ్ల కుర్రాళ్లు ఒక ద‌ళిత యువ‌తిని అత్యాచారం చేశారు.

యూపీలో త‌ర‌చూ జ‌రిగే అత్యాచార సంఘ‌ట‌న‌ల్లో ఇదీ ఒక‌టి మాత్ర‌మే కాదు, ఈ కేసులో ఆ కుర్రాళ్లు పోలీసుల‌పై కాల్పుల‌కు కూడా తెగ‌బ‌డ్డారు! 22, 23 యేళ్ల వ‌య‌సు ఉన్న కుర్రాళ్ల‌కు తుపాకులు కూడా తేలిక‌గా ల‌భించి, వాటితో త‌మ‌ను వెంబ‌డిస్తున్న పోలీసుల‌పై కాల్పులు జ‌రప‌డానికి కూడా వెనుకాడ‌లేద‌న సంఘ‌ట‌న విస్మ‌యాన్ని క‌లిగించ‌క మాన‌దు.

ద‌ళిత యువ‌తుల‌పై అత్యాచారాల సంఘ‌ట‌న‌ల‌తో వార్త‌ల్లో నిల‌వ‌డం, పోలీసుల‌పై గూండాలు కాల్పులు జ‌రిపే వార్త‌ల‌తో కూడా వార్త‌ల‌కు ఎక్క‌డం యూపీకి కొత్త కాదు. ఇవి కొత్త‌వీ కాదు. అయితే నిండా పాతికేళ్లు లేని కుర్రాళ్లు మ‌రోసారి త‌మ రాష్ట్రాన్ని ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కించారు. 

బైక్ మీద త‌మ వారు ఇద్ద‌రు అబ్బాయిల‌తో వెళ్తున్న ఒక యువ‌తిని ఏడు మంది ఆక‌తాయిలు ఆపారు. ఆమె వెంట ఉన్న అబ్బాయిల‌ను త‌రిమేసి, ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఫొటోలూ, వీడియోలు కూడా తీశార‌ట‌.   

త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యం గురించి ఆ యువ‌తి త‌న స్నేహితురాలికి చెప్ప‌గా ఆ పై వారు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. నిందితుల‌ను గుర్తించిన అనంత‌రం వారిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు వెళ్ల‌గా.. విశాల్ ప‌టేల్, అనూజ్ ప‌టేల్ అనే ఇద్ద‌రు యువ‌కులు త‌మ ద‌గ్గ‌రున్న తుపాకులతో పోలీసుల‌పైనే ఎదురుకాల్పులు జ‌రిపారు.  వారి కాళ్ల‌కు కాల్చి మ‌రీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా వారంతా ప‌రారీలో ఉన్నార‌ట‌. 

ఇన్నాళ్లూ అత్యాచారం కేసుల‌తోనే యూపీ హైలెట్ అయ్యేది. ఇప్పుడు కుర్రాళ్లు కూడా పోలీసుల‌పై కాల్పులు జ‌రిపేంత రేంజ్ కు ఎదిగే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. గొప్ప ప్ర‌గ‌తి దిశ‌గానే సాగుతున్న‌ట్టుగా ఉంది!