యూపీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలపై స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మీడియాలో కథనాలు వస్తున్నట్టుగా తమ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలు మార్పులు జరగబోతున్నాయనేవి అనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని, ఎలాంటి మార్పులూ ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్న రాష్ట్రం యూపీ. ముఖ్యమంత్రిగా ఆదిత్యనాథ్ నాలుగేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ హైకమాండ్, ఆర్ఎస్ఎస్ వర్గాలు యూపీ వ్యవహారాలను వరసగా సమీక్షించుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి అక్కడ బీజేపీ పాలనకు ఎదురుగాలి వీస్తోందనే వార్తలు కమలం పార్టీ అధిష్టానం అలర్ట్ అయ్యే పరిస్థితిని కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం బీజేపీ ముఖ్య నేతల దృష్టి అంతా యూపీ మీదే ఉందని వస్తున్న కథనాలు విమర్శలకు కూడా గురవుతున్నాయి. దేశం కరోనా విపత్తును ఎదుర్కొంటున్న సమయంలో కూడా కమలనాథులు వచ్చే ఏడాది యూపీ ఎన్నికలను ఎదుర్కొనడానికి కసరత్తు చేస్తున్న విషయం తీవ్ర విమర్శలకు గురవుతూ ఉంది.
ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం కూడా వచ్చే ఏడాది యథారీతిని యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగతాయంటూ చెప్పుకొచ్చింది. ప్రజలు కరోనా గురించి ఆందోళన చెందుతూ ఉంటే, రాజకీయ పార్టీలు- వ్యవస్థ ఎన్నికల నిర్వహణ గురించి తాపత్రయపడుతూ ఉండటానికి మించిన హేయమైన చర్య మరోటి ఉండకపోవచ్చు.
ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. యూపీ ప్రభుత్వంలో రాజకీయ మార్పులేవీ ఉండవని చెప్పారు. అలాగే తనకు రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలనే తపనేదీ లేదని యోగి అనడం గమనార్హం. యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి పదవిని టార్గెట్ గా చేసుకున్నారనే ఊహాగానాలు ముందు నుంచి ఉన్నాయి. ఈ విషయంలోనే ఆయన పరోక్షంగా స్పందించారు.
తను ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్ పెట్టుకోలేదంటూ కొంత నర్మగర్భంగా కూడా యోగి స్పందించారు! తన ప్రభుత్వంలో ఎవరూ వేలు పెట్టలేరంటూ క్లారిటీ ఇస్తూనే, వేరే పదవుల విషయంలో తను ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకోవడం లేదని, జరిగేది జరుగుతుందన్నట్టుగా యోగి ఆదిత్యనాథ్ స్పందించినట్టున్నారు!