కరోనా విపత్తు వేళ విధానపరమైన అంశాల గురించి, ప్రభుత్వాలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం గురించి రాజకీయ నేతల తీరును పరిశీలిస్తే.. అహంకారం, అసహనం, ఆశ్రిత పక్షపాతంతో కూడిన రీతిలో స్పందిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జీరోగా మిగులుతుంటే, వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తూ, అదే రీతిన స్పందిస్తూ, లాజికల్ గా లేఖలు రాస్తూ, విపత్తును ఎదుర్కొనడానికి తగిన సలహాలు సూచనలు చేస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హీరో అవుతున్నారు.
కరోనా సమయంలో చంద్రబాబు జూమ్ మీటింగులు, గవర్నర్ కు ఫిర్యాదులు వంటి వాటిని పరిశీలిస్తూ.. ఎంతసేపూ అమరావతి, రఘురామకృష్ణంరాజు, మహానాడు, జగన్ మీద బురద జల్లడం, తన తప్పులు తనకు అర్థం కాలేదంటూ నవ్వులపాలు కావడం మినహా చేస్తున్నది ఏమీ లేదు.
తన అనుభవం అంటూ డబ్బా కొట్టుకునే చంద్రబాబు నాయుడు ఎంతసేపూ అడ్డంగా మాట్లాడటమే తప్ప విధాన పరంగా ఒక్క మంచి సలహా ఇచ్చిన పాపాన పోలేదు. వ్యాక్సిన్ విషయంలో కానీ, చికిత్సకు అనుసరించిన వ్యూహాల్లో కానీ కేంద్రానికి ఒక్క లేఖ రాసిన సీన్ కూడా చంద్రబాబుకు లేదు.
ఇక్కడ రెండు ప్రధాన సమస్యలు చిన్న పిల్లలకు కూడా అర్థం అవుతున్నాయి. అందులో ఒకటి దేశ అవసరాలకు తగ్గట్టుగా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదు. వ్యాక్సినేషన్ ఫార్ములాలు రెండు కంపెనీల వద్దే ఉన్నాయి. అవి మాత్రమే ఉత్పత్తి చేయాలంటే దేశ అవసరాలు తీరడానికి సంవత్సరాల సమయం పడుతుంది. కాబట్టి టెక్నాలజీని పంచుకోవాలి. కనీసం దేశీయ వ్యాక్సిన్ తయారీలో కేంద్ర ప్రభుత్వ చొరవ కూడా ఉంది కాబట్టి.. ఆ సంస్థను గద్దించి అయినా టెక్నాలజీని పంచుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలి.
ఈ అంశంపై చంద్రబాబు ఇప్పటి వరకూ కిక్కురుమనలేదు, ఇప్పుడు కూడా ఈ అంశం గురించి స్పందించడం లేదు! ఎంతసేపూ జగన్ ను విమర్శించడానికే చంద్రబాబుకు సమయం చాలడం లేదు. కేంద్రానికి మద్దతు అంటూ ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు మహానాడులో. అంతే కానీ, వ్యాక్సిన్ ఉత్పత్తి వైఫల్యం గురించి కూడా కిక్కురుమనేంత సీన్ లేదు చంద్రబాబుకు.
ఇదే అంశం గురించి జగన్ కేంద్రానికి లేఖ రాశారు. కోవ్యాగ్జిన్ ఫార్ములాను పంచాలనే సలహాలతో కూడిన, లాజిక్స్ ను జగన్ ప్రస్తావించారు. జగన్ లేఖ కే కేంద్రం కదిలిపోయిందని అనలేం కానీ, ఆ తర్వాత కేంద్రం అదే పనికి పూనుకుంది!
కట్ చేస్తే.. వ్యాక్సిన్ భారం, బాధ్యత గురించి కేంద్రం తీరు తీవ్ర విమర్శల పాలయ్యింది. 45 యేళ్ల పై వయసు వారి బాధ్యతలే తమకంటూ కేంద్రం తేల్చడం, వ్యాక్సిన్ కంపెనీలు కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు ఎక్కువ రేటుకు వ్యాక్సిన్లను అమ్ముతామనడం, ప్రైవేట్ కు వ్యాక్సిన్లు భారీగా తరలిపోవడం ఇవన్నీ.. వ్యాక్సినేషన్ అంశంపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి.
గ్లోబల్ టెండర్ల అంశంపై కూడా పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉండటం.. రాష్ట్రాలను అశక్తులుగా చేసింది. దీనిపై పినరాయి విజయన్, నవీన్ పట్నాయక్, వైఎస్ జగన్ లు స్పందించారు. ఈ విధానమే సబబుగా లేదని బహిరంగంగా లేఖలు రాశారు. సుప్రీం కోర్టు కూడా కేంద్రాన్ని నిలదీసింది. దీంతో.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దిగొచ్చింది. వ్యాక్సినేషన్ బాధ్యత పూర్తిగా తనదే అంటూ ప్రకటించింది. స్వయంగా మోడీనే ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది!
మరి తనను తాను అంతర్జాతీయ నాయకుడిని అంటూ చెప్పుకునే చంద్రబాబు నాయుడు… కేంద్రం ఇది వరకూ ప్రకటించిన వ్యాక్సినేషన్ పాలసీ గురించి కిక్కురుమనగలిగారా? ఇప్పుడు వ్యాక్సిన్ బాధ్యతను కేంద్రం తీసుకోవడంతో.. చంద్రబాబు మోడీ భజన అందుకోనూ వచ్చు! అయితే.. కేంద్రం పాలసీ గందరగోళంగా ఉన్నప్పుడు కిక్కురుమనలేకపోవడం చంద్రబాబు చేతగాని తనాన్ని హైలెట్ చేస్తోంది.
కేంద్రం అనుసరిస్తున్న తీరులోని లోపాలపై స్పందింస్తూ, అలా కాదు, ఇలా.. అంటూ లేఖలు రాయగల స్థితిని జగన్ అందుకున్నారు. చంద్రబాబు మాత్రం జగన్ ను విమర్శిస్తూ.. తన డబ్బా కొట్టుకుంటూ అదే రాజకీయం అనుకుంటున్నారు. ఇక రఘురామకృష్ణంరాజు గురించి, రామకృష్ణ గురించి కేంద్రానికి, గవర్నర్ కు లేఖలు రాయడం చంద్రబాబుకు ఇతర ముఖ్యమైన అంశాలు.
తన ప్రాధాన్యతా అంశాలు, విజన్ తో జగన్ దార్శానికతను చాటుకుంటూ ఉండగా, రాజకీయ చరమాంకంలో చంద్రబాబు నాయుడు మాత్రం జస్ట్ జీరోగా మిగులుతున్నారు.
-జీవన్