తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేసిన షర్మిల ఒక ఆకర్షణీయ నాయకురాలిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆమె సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్ళినప్పుడు షర్మిల వైఎస్సార్సీపీని బతికించడంకోసం, దాని ఉనికిని కాపాడటం కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసింది.
ఒక మహిళ అంతటి సుదీర్ఘ పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ ధైర్యంగా ఆ పనిచేసి తన స్టామినా నిరూపించుకుంది. చరిత్ర సృష్టించింది. అప్పటి ఆమె స్టామినాను, పట్టుదలను, అంకితభావాన్ని తెలంగాణ ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారు. దానికి తోడుగా వైఎస్సార్ ఇమేజ్ తోడయ్యింది.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే వైఎస్సార్ ఇమేజ్ ఒక్కటే ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి కారణం కాదు. తనకంటూ సొంత ఇమేజ్ కూడా ఉంది. ఎందుకని ఆమె తన రాజకీయ అరంగేట్రానికి తెలంగాణాను ఎంచుకున్నారనేది చర్చ అప్రస్తుతం. పోరాటం అంత సులువు కాదని, కొండలను ఢీకొంటున్నామని షర్మిల చెప్పింది. ఆమె చెప్పింది కరెక్టే.
పురుషపుంగవులే రాజకీయ పార్టీలు పెట్టి తలకిందులవుతున్న ఈ రోజుల్లో ఒక మహిళ రాజకీయ పార్టీ పెట్టడం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరగలేదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాజకీయ పార్టీ పెట్టి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆమెకో సొంత రాజకీయ నేపధ్యం ఉంది. ఆమె పార్టీ పెట్టే సమయానికి ఆ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు కూడా ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ షర్మిల పరిస్థితి వేరు. ఆమె తండ్రికి, అన్నకు రాజకీయాలతో సంబంధం ఉందిగానీ ఆమెకు లేదు.
జగన్ జైల్లో ఉన్నప్పుడు చేసిన పాదయాత్ర మినహా ఆమెకు రాజకీయాలతో సంబంధంలేదు. జగన్ సీఎం అయినాగానీ షర్మిలను ఏ చట్ట సభకూ పంపలేదు. ఆమె పార్టీ పెట్టాలనుకోవడం సాహసోపేతమే. ఆమె కొండలను ఢీకొంటున్నానని చెప్పింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడూ కొండలే.
కాంగ్రెస్ బలం కాస్త తక్కువగా ఉండొచ్చు. కానీ తీసివేయలేం. ఇక ఆమె అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆమె ఎదుర్కోబోయే కొండే. షర్మిల తెలంగాణ ప్రజల ఆదరణ పొందాలంటే ఏ విషయంలోనైనా తెలంగాణాకు అనుకూలంగా మాట్లాడాలి. తెలంగాణ ప్రయోజనాలను రక్షించేవిధంగా ఉండాలి.
ఇప్పటికిప్పుడు ఆమె ఏమీ మాట్లాడలేదు. పార్టీ పెట్టాక తప్పనిసరిగా తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాల్సిందే. వ్యక్తిగతంగా కేసీఆర్ కు జగన్ కు మధ్య స్నేహం ఉండొచ్చు. ఉందోలేదో తెలియదుగాని అలా ప్రచారం జరుగుతోంది.
రెండు రాష్ట్రాల మధ్య పీట ముళ్ళుగా కొన్ని సమస్యలున్నాయి.వాటిల్లో ప్రధానమైంది ఇరిగేషన్ ప్రాజెక్టులు. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనే గొడవలు వస్తాయి. ఏపీ- తెలంగాణ సమస్య కూడా అదే. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం తాజాగా ఆరోపించింది. వాటి నిగ్గు తేల్చాలని కృష్ణా బోర్డును కోరింది.
ఇలాంటి విషయాల్లో షర్మిల తెలంగాణ తరపున మాట్లాడగలగాలి. చంద్రబాబు నాయుడు ఇలా తెలంగాణ తరపున మాట్లాడలేకపోవడంవల్లనే టీడీపీకి తెలంగాణలో ఆదరణ లేకుండా పోయింది. అయితే చంద్రబాబు సమస్య వేరు. ఆయన పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందికాబట్టి సహజంగానే ఏ అభిప్రాయమూ చెప్పలేడు.
అందులోనూ ఆయన రాజకీయమంతా ఏపీలోనే కాబట్టి ఏదైనా మాట్లాడితే ఆయనకు రాజకీయంగా నష్టం. కానీ షర్మిలకు ఆ సమస్య లేదు. ఆమె రాజకీయమంతా తెలంగాణలోనే కాబట్టి అవసరమైతే జగన్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడాలి. గోడమీద పిల్లిలా వ్యవహరిస్తే విమర్శలు ఎదుర్కోక తప్పదు.