తన తండ్రి అక్రమాలకు పాల్పడినట్టుగా తమ ఇంటికి వచ్చిన నోటీసుల వ్యవహారం వల్ల తనకు నవ్వొస్తోందని ప్రకటించారు తెలుగుదేశం నేత నారా లోకేష్. సాధారణంగా తండ్రిని ఎవరైనా ఏమైనా అంటే ఏ కొడుకు అయినా కోపం వస్తుంది. అక్రమాలకు పాల్పడకపోయినా, పాల్పడ్డారు అంటూ ఎవరైనా ఆరోపిస్తే మరింత కోపం వస్తుంది. అక్రమాలకు పాల్పడలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు.
అయితే అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు తనయుడు మాత్రం తన తండ్రికి వచ్చిన నోటీసులను చూసి నవ్వుకుంటున్నారట! ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ఆ పదవికే ద్రోహం చేశాడని, చేసిన ప్రమాణాన్ని అతిక్రమించి ఆశ్రిత పక్షపాతం చూపాడని, రాజధాని అవకాశాన్ని వాడుకుని బినామీల కోసం పని చేశాడనే ఆరోపణలు తన తండ్రిపై వస్తే.. లోకేష్ కు నవ్వెందుకు వస్తోందో మరి!
ఇంతకీ నారా లోకేష్ ఏం ట్వీటారంటే..
''తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని నమ్మించడానికి వైఎస్ జగన్ పడుతున్న తిప్పలు చూస్తుంటే నవ్వొస్తుంది.అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అనే అంశమే లేదంటూ కోర్టు అనేక సార్లు చీవాట్లు పెట్టినా పాత పాటే ఎన్నాళ్లు? 21నెలలు శోధించి అలసిపోయి ఆఖరికి రెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సి,ఎస్టీ కేసు పెట్టే పరిస్థితికి దిగజారారు.సిల్లీ కేసులతో చంద్రబాబు గారి గెడ్డం మీద మెరిసిన వెంట్రుక కూడా పీకలేరు.అమరావతిని అంతం చెయ్యడానికి జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా,దైవభూమి తనని తానే కాపాడుకుంటుంది.''
ఇదీ నారా లోకేష్ ట్వీటు. ఇందులో కూడా పీకడాన్ని ఆయన మరిచిపోలేదు. చంద్రబాబు నాయుడు గడ్డం వెంట్రుక కూడా పీకలేరని ఆయన తనయుడు తనదైన భాషలో, తను, తన తండ్రి కలిసి జాతీయం చేసిన భాషలో సెలవిచ్చారు!
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, లోకేష్ మాట్లాడిన పీకుడు భాషను చాలా మంది అసహ్యించుకున్నారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగా వచ్చాయి. అయినా నారా లోకేశం భాష మాత్రం మారుతున్నట్టుగా లేదు. అసలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో అది పీక్స్ కు వెళ్లి ఉండవచ్చు. ఇలాంటప్పుడు మరింత దారుణమైన భాషే రావొచ్చు. కాబట్టి లోకేష్ పీకుడు భావవ్యక్తీకరణ కొనసాగడంలో పెద్ద ఆశ్చర్యం కూడా లేదేమో!