విశాఖకు మరో పేరు సిటీ ఆఫ్ డెస్టినీ. అద్భుతమైన గమ్యస్థానంగా పేరున్న విశాఖలో గమ్యానికి చేరకుండానే ప్రాణాలు పోతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువ అయ్యారు. విశాఖ టూ భీమిలీ బీచ్ రోడు పాతిక కిలోమీటర్ల దాకా ఉంటుంది. అందమైన మలుపులు పక్కనే సాగర కెరటాలతో పగటి పూట ప్రయాణం అదుర్స్ అన్నట్లుగా సాగినా రాత్రి మాత్రం డెడ్లీ జర్నీ అవుతోంది.
బీచ్ రోడ్ వెంబడి ఉన్న రెస్టారెంట్లు బార్స్ లలో యువత మత్తెక్కి గమ్మత్తుగా బైక్ రైడింగ్ చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని సార్లు ఎదుటి వారివి తీసేస్తున్నారు. అలాగే కార్లలోనూ మందుల బాబులు రాష్ డ్రైవింగ్ తో అమాయకుల ప్రాణాలను హరించేస్తున్నారు. సోమవారం రాత్రి విశాఖలోని రుషికొండ వద్ద జరిగిన ఘోరమైన కారు యాక్సిడెంట్ లో కారులో బ్యాక్ సీటులో ఉన్న యువకుడితోపాటు ఎదురుగా బైక్ మీద వస్తున్న అమాయకులైన ఇద్దరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి.
దీంతో విశాఖ పోలీసులు బీచ్ రోడ్ లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక గస్తీని సైతం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేయడం ద్వారా మందుబాబుల పని పట్టడంతో పాటు బైక్ కార్ ర్యాష్
రైడింగ్ రేసింగులకు కూడా అడ్డుకట్ట వేయనున్నారు. రాత్రి తొమ్మిది దాటితే చాలు స్పోర్ట్స్ బైక్స్ వేసుకుని బైక్ రేసింగ్ చేసే యువత ఎక్కువ అయిపోయారు. వీరిని గుర్తించి గట్టిగా కాషన్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
ఇదే విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ టూ రైల్వే స్టేషన్ దాకా ఒక ఫ్లై ఓవర్ ఉంది. దీని మీద కూడా రాత్రి అయితే చాలు బైక్ రేసింగ్స్ చేస్తూ మందు బాబులు చిందులు వేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇటీవలే ఇలా దారుణమైన యాక్సిండెంట్ చేసి ముగ్గురు ప్రాణాలు పోగొట్టడానికి కారణం అయ్యారు. దాంతో ఈ ఫ్లై ఓవర్ పైన కూడా ఓవరాక్షన్ ఎవరూ చేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
విశాఖ వంటి వేగవంతమైన జీవన విధానం కలిగిన నగరంలో పబ్ కల్చర్ పెరుగుతోంది. దాంతో లేట్ నైట్ పార్టీల తరువాత యూత్ బైక్ జర్నీలు ప్రమాదానికి కారణం అవుతున్నాయి. దీంతో కౌన్సిలింగ్ చేపట్టాలని సిటీ పోలీస్ నిర్ణయించారు. అభివృద్ధి మాటునే ఆపదలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి. వాటిని చేదిస్తూ కూల్ సిటీగా విశాఖను నిలపడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పోలీసులు చెబుతున్నారు.