వైసీపీ చేతిలో సిట్ నివేదిక…అయినా…?

మాటకు వస్తే చాలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ తీయని మాటలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుకుతున్నారు. బాబు చెవిలో అమృతాన్నే ఒలికిస్తున్నారు. మాజీ మంత్రి రీ యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్…

మాటకు వస్తే చాలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ తీయని మాటలను మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పలుకుతున్నారు. బాబు చెవిలో అమృతాన్నే ఒలికిస్తున్నారు. మాజీ మంత్రి రీ యాక్టివ్ అయ్యారు. ట్విట్టర్ ను రెగ్యులర్ గా వాడుతున్నారు. వైసీపీని దుమ్మెత్తిపోతున్నారు.

చంద్రబాబే మన సీఎం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. విశాఖలో వైసీపీ నాయకుల భూ దోపిడీ మీద చార్జిషీట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ చంద్రబాబు బినామీలు విశాఖలో భూములు దోచుకున్నారని చెప్పి నాడు విశాఖలో జగన్ ఆందోళన నిర్వహించారని, కానీ అధికారంలోకి వచ్చాక భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇక్కడ గంటా సరైన పాయింటే లేవనెత్తారు. ఆనాడు వైసీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు అన్నీ కూడా విశాఖ భూ దోపిడీ మీద ఎలుగెత్తి నిరసనలు తెలియచేశాయి. ఆ వత్తిడికి తలొగ్గి చంద్రబాబు ప్రభుత్వం విశాఖ భూ దందా మీద సిట్ ని నియమించి విచారణ జరిపించింది. ఆ నివేదికను టీడీపీ ప్రభుత్వం వెల్లడించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పాత సిట్ నివేదిక పక్కన పెట్టి కొత్తగా సిట్ ని ఏర్పాటు చేసి విచారణ జరిపింది. కొత్త సిట్ ఏమని నివేదిక ఇచ్చిందో తెలియదు.

ఇపుడు గంటా కూడా అదే అంటున్నారు. భూ దందా అంటూ నాడు వైసీపీ నేతలు విమర్శలు చేశారు కదా అధికారంలోకి ఎందుకు మాట మార్చారని అడుగుతున్నారు. అప్పట్లో టీడీపీ పెద్దల మీదనే భూ దందా ఆరోపణలు వచ్చాయి. ఈ సంగతి లోకమంతటికీ తెలుసు. వైసీపీ ఈ విషయంలో సిట్ నివేదిక బయటపెట్టి యాక్షన్ కి దిగి ఉంటే రాజకీయం వేరే లెవెల్ లో ఉండేది అని అని అంటున్నారు.

వైసీపీ ఆ పని ఎందుకు చేయలేదో కానీ విపక్షం నుంచే ఇపుడు డిమాండ్ వస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారే భూ దందాకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. సరైన సమయంలో సిట్ నివేదికను బయట పెట్టి టీడీపీని కార్నర్ చేయవచ్చు కదా. 

ఇంతటి సువర్ణ అవకాశం చేతిలో ఉండగా వైసీపీ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది అన్నది అర్ధం కావడం లేదు అంటున్నారు. గంటా లాంటి వారే నాటి భూ దందాల మీద ఏ చర్యలూ తీసుకోలేదని అంటూంటే ఇప్పటికైనా వైసీపీ సర్కార్ కదిలి భూ దందా భాగోతాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.