యాంటీబాడీలు ఎంత ఎక్కువ ఉంటే అంతగా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన దేశంలో ప్రధానంగా రెండు వ్యాక్సిన్లు ఉన్నాయి. ఒకటి ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకాకు చెందిన కొవిషీల్డ్, హైదరాబాద్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్. కరోనాను కట్టడి చేయడంలో ఈ రెండు వ్యాక్సిన్లు దేనికవే ప్రత్యేకమనే అభిప్రాయాలున్నాయి. ఈ మేరకు అధ్యయన సంస్థలు కూడా అదే చెప్పాయి.
అయితే డాక్టర్ ఏకే సింగ్, ఆయన సహచర వైద్య నిపుణులు ఈ రెండు వ్యాక్సిన్లపై అధ్యయనం చేసి మరిన్ని అద్భుతమైన విషయాలను వెల్లడించారు. ప్రధానంగా రెండు వ్యాక్సిన్లలో యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి రేటుపై కొత్త విషయాన్ని కనుగొన్నారు. యాంటీబాడీల అభివృద్ధిలో మాత్రం కొవిషీల్డ్ ఎంతో మెరుగ్గా పనిచేస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనాన్ని మొత్తం 515 మంది ఆరోగ్య కార్యకర్తలపై నిర్వహించారు. వీళ్లలో 305 మంది పురుషులు, 210 మంది మహిళలు ఉన్నారు. వీళ్లు ఈ వ్యాక్సిన్ల రెండు డోసులు తీసుకున్నారు. మొత్తం 425 మంది కొవిషీల్డ్ తీసుకున్న వాళ్లలో 98.1 శాతం, 90 మంది కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 80 శాతం సెరోపాజిటివిటీ (ఎక్కువ యాంటీబాడీలు) కనిపించినట్టు అధ్యయన బృందం తేల్చి చెప్పింది.
రోగ నిరోధక వ్యవస్థను అందించడంలో రెండు వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నట్టు తెలిపారు. అయితే సెరోపాజిటివిటీ రేట్లు, సగటు యాంటీ-స్పైక్ యాంటీబాడీ టైటర్‌ల విషయానికి వస్తే మాత్రం కొవిషీల్డ్ చాలా మెరుగ్గా ఉన్నట్లు అధ్యయన బృందం గుర్తించింది. ఇది నిర్ధారించేందుకు యాంటీబాడీ టైటర్ బ్లడ్ టెస్టులు కూడా చేశారు.
ఇది రక్తంలో యాంటీబాడీల ఉనికితోపాటు వాటి స్థాయిని కూడా చెబుతాయి. దీని ప్రకారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో యాంటీబాడీ టైటర్ 115 AU/ml (ఆర్బిట్రరీ యూనిట్స్ పర్ మిల్లీలీటర్)గా ఉండగా.. కొవాగ్జిన్ తీసుకున్న వాళ్లలో 51 AU/mlగా ఉంది. ఈ లెక్కన కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్‌లో యాంటీ బాడీల సంఖ్య చాలా ఎక్కువని ఈ అధ్యయనం తేల్చింది.
అయితే ఏ వ్యాక్సిన్‌ను తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని అధ్యయనం బృందం స్పష్టం చేసింది. కానీ ఎప్పటికప్పుడు పరిశోధనల్లో భాగంగా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న సంగతిని మాత్రమే లోకానికి చాటి చెప్పడం తమ ఉద్దేశంగా పరిశోధన సంస్థ పేర్కొంది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ వల్ల అదనపు ప్రయోజనాలున్నాయని తెలిసొచ్చింది.