ఏపీ శాసన మండలి రద్దుపై ముఖ్యమంత్రి జగన్ ఆశలు వదులుకున్నట్లుంది. 2020 లో వైఎస్ జగన్ చాలా ఆవేశంతో,ఆగ్రహంతో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయించాడు. అందుకు కారణాలేమిటో అందరికీ తెలుసు. కానీ ఆనాడు జగన్ తొందర పడ్డాడని అనిపిస్తోంది. కాస్త ఓపిక పెట్టాల్సింది. ఎందుకంటే …ఈ ఏడాది మండలిలో జగన్ పార్టీ ఆధిపత్యంలోకి రాబోతోంది.
ఒకప్పుడు అంటే 1985 లో కాంగ్రెస్ మీద కోపంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మండలిని రద్దు చేయించారు. వైఎస్ జగన్ టీడీపీ మీద కోపంతో మండలిని రద్దు చేయిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. తాను తీర్మానం చేయించగానే మండలి రద్దయిపోతుందని జగన్ అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న దానికి భిన్నంగా జరుగుతోంది.
ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం మండలి రద్దు గురించి పట్టించుకోలేదు. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేస్తే కోర్టులో విచారణ జరిగి శిక్ష పడేదాకా అతన్ని నిర్దోషిగానే పరిగణిస్తారు కదా. అలాగే మండలి రద్దుపై కేంద్రం విచారించి పార్లమెంటులో అది ఆమోదం పొందేంతవరకు రాష్ట్రంలో మండలి సజీవంగానే ఉంటుంది. ఖాళీ అయిన సభ్యుల స్థానాలు భర్తీ చేయాల్సిందే.
మండలి రద్దుగానీ, రద్దయిన మండలిని పునరుద్ధరించడంగానీ అంత సులభమైన వ్యవహారం కాదు. ఎన్టీ రామారావు మండలిని రద్దు చేశాక దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించడానికి ఏడేళ్లు పట్టింది. అంత క్లిష్టమైన ప్రక్రియ ఇది. రద్దుకైనా, పునరుద్ధరణకైనా మధ్యలో అనేక రాజకీయ కారణాలు, పరిణామాలు అడ్డుగా ఉంటాయి.
ఆనాడు ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆవేశం ఎక్కువగా ఉంది. దీంతో మండలిని రద్దుచేసి పారేశాడు. ఈనాడు జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆవేశం ఎక్కువ. అందుకే మండలి రద్దు చేయిస్తూ తీర్మానం చేయించాడు. ఎలాంటి మంత్రి పదవులు చేయకుండా ఇద్దరూ నేరుగా ముఖ్యమంత్రులైనవారే.
ఈ సంగతి అలా పక్కనపెడితే …ఆంధ్రప్రదేశ్ శాసనమండలి కొత్త చైర్మన్ ను నియమించాల్సి ఉంది. టీడీపీ హయాంలో నియమితుడైన షరీఫ్ పదవీ కాలం ఈమధ్యనే పూర్తయింది. కొత్త చైర్మన్ పేరు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ అధికారికంగా ప్రకటించటమే మిగిలివుందని ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మండలిలో తగిన బలం లేకపోవటంతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డిఏ బిల్లు రద్దు విషయంలో ప్రభుత్వం ఎన్నో ఇబ్బంది పడింది. అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. అప్పటి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించిన తీరుపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని పర్యవసానంగానే మండలి రద్దుకు తీర్మానం కూడా చేశారు. కానీ మండలిలో వైసీపీ సభ్యుల పెరగడంతో పాటు కొందరికి పదవులు ఇచ్చే అవకాశం కూడా ఉండడంతో.. మండలిని కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారు.
ఛైర్మన్ ఎంపికకు సంబంధించి వైఎస్ జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీ బాటలో వెళ్లేందుకే ఆయన మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మొన్నటి వరకు ముస్లిం మైనారిటీ నేత షరీఫ్ ఆ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు మళ్లీ ముస్లిం మైనారిటీ నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.. హిందూపురం నేత, మాజీ ఐపీఎస్ అధికారి, చంద్రబాబుకు భద్రతా అధికారిగా పని చేసిన ఇక్బాల్ వైపు సీఎం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
2019 ఎన్నికల్లో ఇక్బాల్ వైసీపీ పార్టీ హిందూపుర్ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన నందమూరి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈ మధ్యనే మరోసారి ఆయనను ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ నిర్ణయించారు. 2027 మార్చి 29 వరకు ఆయన ఎమ్మెల్సీగా ఉంటారు.
ఇప్పటి వరకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న రెడ్డి సుబ్రమణ్యం సైతం టీడీపీ నుండే ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం జూన్ 18వ తేదీతో ముగుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ స్థానంలో గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, వైసీపీ బీసీ సంఘాల అధ్యక్షుడిగా ఉన్న జంగా క్రిష్ణమూర్తికి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
షరీఫ్‌తో పాటుగా బీజేపీకి చెందిన సోము వీర్రాజు, వైసీపీకి చెందిన డీసీ గోవిందరెడ్డి పదవీ విరమణ చేసారు. ఈ స్థానాలకు కరోనా తగ్గిన తరువాత మాత్రమే ఎన్నికలు ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మూడింటితో పాటు ఈ నెల 18న స్థానిక సంస్థల కోటాలో మరో ఎనిమిది స్థానాలు ఖాళీ అవుతున్నాయి.
అందులో ఏడు టీడీపీకి కాగా..వైసీపీ నుండి ఉమ్మారెడ్డి పదవీ విరమణ చేయబోతున్నారు. అదే విధంగా నామినేటెడ్ కోటాలో టీడీపీ నుండి ముగ్గురు..వైసీపీ నుండి ఒకరు పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో పెద్దల సభలో టీడీపీ సంఖ్యా బలం మొత్తం 58 స్థానాలకు గాను..15 మందికే పరిమితం కానుంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలో సైతం వైసీపీకి పూర్తి ఆధిపత్యం దక్కుతుంది.