సినిమా హీరోలకే కాదు, సినిమాలకు కూడా మేకప్ వుంటుంది. బయటకు కనిపించేదంతా నిజం కాదు. ఆచార్య సినిమాకు పైన కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణ అనే పేరు వుంది తప్ప నిర్మాణంలో వాటా లేదని గ్రేట్ ఆంధ్ర మొదటి నుంచీ వెల్లడిస్తూనే వచ్చింది. కానీ అలా వెల్లడించినపుడల్లా యూనిట్ నుంచి ఖండన వచ్చేది.
ఇద్దరు మెగా హీరోలు వున్న సినిమా కనుక, వారి ప్రెజర్ వల్ల నిర్మాత అలా ఖండనలు ఇస్తూనే వచ్చారు. అంతే కాదు, దర్శకుడు కొరటాల తీస్తున్న సినిమా వల్ల, ఖర్చు వల్ల, కొంత లాభం తీసుకుని ప్రాజెక్ట్ ను నిర్మాత నిరంజన్ రెడ్డి ఆయనకే వదిలేసారని ముందే వెల్లడించాం. దాన్నీ అంగీకరించలేదు.
ఇప్పుడు సినిమా విడుదలకు ముందు నుంచి అసలు కలర్ బయటపడుతూ వచ్చింది. మేకప్ మాయమైంది. సినిమా విడుదలకు ముందే గడబిడ మొదలైంది. ముందు రోజు రాత్రి నిర్మాత నిరంజన్ రెడ్డి అడ్డం పడి, తాను సంతకాలు చేసి, కొన్ని సంతకాలు చేయించుకుని సినిమాను విడుదల చేసారని వార్తలు వచ్చాయి. ఆ చాప్టర్ ముగిసింది. సినిమా విడుదలైంది. మెగా కెరీర్ లోనే దారుణ డిజాస్టర్ గా మిగిలింది.
ఇక అక్కడ మొదలైంది అసలు కథ. నైజాం 20 కోట్లు నష్టం. సీడెడ్ 15 కోట్లు నష్టం అంటూ ఫిగర్లు బయటకు వచ్చాయి. ఆంధ్రలో వైజాగ్, ఈస్ట్, కృష్ణ, గుంటూరు అన్నీ కొరటాల సన్నిహితులే కావడం వల్ల గోల, గొడవ జరగలేదు. వెస్ట్ గోదావరికి మాత్రం సర్కారు వారి పాట టైమ్ లో మైత్రీ మూవీస్ చేత కొటిన్నర వరకు అడ్జస్ట్ చేసారు.
నైజాం ఏరియాకు విరాటపర్వం విడుదల టైమ్ లో ఆ బయ్యర్ కు అవసరం కాబట్టి, అందాకా అయిదు కోట్ల వరకు సర్దుబాటు చేసినట్లు బోగట్టా. ఇవన్నీ చేసింది కొరటాలనే. అంతే తప్ప అప్పటి వరకు నిర్మాణ భాగస్వామ్యం చెప్పిన కొణిదెల ప్రొడక్షన్స్ కాదు. నైజాం, వెస్ట్ గోదావరి ఎంతొ కొంత చేయడంతొ సీడెడ్ జనాలు ఆగ్రహించారు.
తామేం పాపం చేసుకున్నామని ఏకంగా కొరటాల ఆఫీసు మీదకే వచ్చారు. ఆఖరికి ఆరు కోట్ల మేరకు సెటిల్ చేయక తప్పలేదు.
అయితే ఇక్కడ ఓ భేతాళ ప్రశ్న వుంది. అసలు ఆచార్యకు ఎంత ఖర్చయింది. ఎంతకు మార్కెట్ చేసారు. ఎంత లాభం మిగిలింది. ఆ లాభంలోంచే ఈ సర్దు బాట్లు అన్నీ చేసారా? చివరకు కొరటాలకు లాభం మిగిలిందా? నష్టమా? అన్నది మాత్రం తెలియదు.
హ్యండిచ్చిన నాన్ థియేటర్
సినిమా ఫ్లాప్ కావడంతో నాన్ థియేటర్ డబ్బులు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. శాటిలైట్ కొన్న సంస్థ కాజల్ సినిమాలో లేకపోవడంతో, ఒప్పంద ఉల్లంఘన కింద రెండున్నర కోట్లు తెగ్గోసింది. అలాగే నాన్ తెలుగు హక్కులు అక్కరలేదని చెప్పి అయిదు కోట్లు ఆపేసింది. ఆ విధంగా అక్కడ ఏడున్నర కోట్లు పోయింది. దాని మీద ఆశలు పెట్టుకున్న కొరటాల కు షాక్ తగిలింది.
ఇదో లెసన్
దర్శకులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటే ఉత్తమం అనే లెసన్ ఇప్పుడు ఆచార్య మిగిల్చింది. అజ్ఙాతవాసి టైమ్ లో అక్కడ నిర్మాతగా చిన బాబు వున్నారు కనుక, బయ్యర్లు అటు త్రివిక్రమ్ మీదకు వెళ్లలేదు. పవన్ కు మాట రాలేదు. వచ్చిన లాభాల్లోంచి చకచకా డబ్బులు కట్టేసారు. మైత్రీ సినిమాలకు కూడా అదే పరిస్థితి. చందు మొండేటి చేసిన బలమైన గాయం సవ్యసాచి అయినా, మరే సినిమా అయినా రెండో కంటికి తెలియకుండా సెటిల్ చేసారు. దానికి కారణం నిర్మాతలు వారే కాబట్టి.
కానీ కొరటాల శివతో మొదటి నుంచీ ఇదే సమస్య అంటారు నిర్మాతలు. భరత్ అనే నేను టైమ్ లో కూడా అదే తకరారు వచ్చింది. మార్కెటింగ్ అంతా ఆయన డీల్ చేయడం కొరటాలకు అలవాటు. బయ్యర్లు అంతా తన సన్నిహితులు వుండేలా చూసుకుంటారు. ఒరిజనల్ ఫిగర్లు బయటకు రానివ్వరు. ఇది కొంతకాలం నడిచింది. ఆచార్య టైమ్ లో గట్టిగా బొప్పికట్టింది.
నిజానికి కొరటాల మంచి రచయిత, దర్శకుడు. అంతకు మించి మంచి మనిషి. ఈ మార్కెటింగ్ రంథి పక్కన పెడితే ఆయన మంచి సినిమాలు అందించలరు. ఇకనైనా ఈ నిర్మాణాలు, మార్కెటింగ్ అన్నీ పక్కన పెడితే బెటర్.
విభిన్నమైన ఐడియాలజీతో పిల్లలు కూడా వద్దనుకుని బతికే కొరటాల, వీలయనపుడల్లా రామకృష్ణ మిషన్ కు వెళ్లి సేవలు చేసే కొరటాలకు ఈ డబ్బు రంథి ఎందుకు? ఆలోచించుకోవాలి. మంచి సినిమాలు అందించాలి.