ఒకప్పట్లో ఢిల్లీ పార్లమెంటులోనే ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందిన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. అలాంటిది.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉన్నదా లేదా అనే దయనీయమైన పరిస్థితిలో మనుగడ సాగిస్తోంది. సరే.. అంతో ఇంతో ప్రతిపక్షమే గనుక.. ఆ మేరకు ప్రభుత్వ విధానాల మీద క్రియాశీలంగా పనిచేస్తోందా? పోరాడుతోందా? అంటే అది కూడా సందేహమే.
చిత్తశుద్ధితో పనిచేసే పార్టీకి ప్రజల సమస్యలు తమంతగా కనిపించాలి.. వాటిమీద ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేలా పనిచేయాలి. కానీ.. తెలుగుదేశం విషయానికి వస్తే.. వారు ఎవరో ఒకరు చేసిన పనిని.. తాము కాపీ కొట్టడం తప్ప స్వతంత్రంగా వ్యవహరించే ఉత్సాహాన్ని కోల్పోయినట్టుగా ఉన్నారు.
సోషల్ మీడియా ను చాలా బాగా ఉపయోగించుకోవడం అనేది తెలుగుదేశానికి తెలియని విద్య ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే.. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు.. అని వాళ్లు చెప్పుకుంటూఉంటారు. అయితే వాళ్లు సోషల్ మీడియాను వాడుకుని చేసేదంతా కుట్రపూరితమైన విషప్రచారం మాత్రమే. చాటుమాటుగా ప్రభుత్వం మీద అనుచిత రీతిలో బురద చల్లడానికే వారికి ప్రతిసందర్భంలోనూ సోషల్ మీడియా ఉపయోగపడుతూ వచ్చింది.
అంతే తప్ప అదే సోషల్ మీడియాతో ప్రభుత్వం మీద క్రియాశీలమైన దాడి చేయవచ్చునని వారు గ్రహించినట్టు లేదు. తాజాగా.. చెత్త రోడ్లు చెత్త సీఎం అనే హ్యాష్ ట్యాగ్ తో టీడీపీ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. ప్రజలు చెత్త రోడ్లను గమనిస్తే.. ఆ ఫోటోలు, వీడియోలు తీసి పంపితే.. వారు సోషల్ మీడియా నిండుగా ప్రచారం చేసిపెడతారట.
కార్యక్రమం బాగానే ఉంది.. కానీ, ఇందులో తెలుగుదేశం సొంత బుర్ర ఉన్నదా అనేదే సందేహం. ఏ చిన్న గ్రామీణ రోడ్డు నుంచి నగరాల్లోని రోడ్ల వరకు ఏది కొద్దిగా పాడై ఉన్నా పచ్చ మీడియా చాలా హాట్ హాట్ గా ఫోటోలతో కథనాలు వండి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూనే ఉంది. తెలుగుదేశం అచ్చంగా వారి ప్రచారాన్ని ఫాలో అవుతున్నట్టు ఉంది తప్ప.. సొంత బుద్ధితో, తాము స్వయంగా గమనించి ప్రజల కష్టాలను పట్టించుకుంటున్నట్టుగా లేదు.
సరే ఏదో ఒకటి.. లేటుగా అయినా పచ్చ మీడియా స్ఫూర్తితో స్పందించారే అనుకుందాం. మరీ జనసేన అడుగుజాడలలో నడుస్తూ.. వారి కార్యచరణను కాపీ కొడుతూ.. సోషల్ మీడియా పోరాటం మాత్రమే చేయాలా? క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటం చేయగల సత్తా తెలుగుదేశానికి లేదా? ఆ రూపేణా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావచ్చుననే సంగతి ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీకి తెలియదా?
జనసేన పరిస్థితి వేరు. క్షేత్రస్థాయిలో రాష్ట్రవ్యాప్త పోరాటాలకు పిలుపునిస్తే అభాసుపాలైపోతామని వారికి తెలుసు. క్షేత్రస్థాయి నిర్మాణం లేని డొల్ల పార్టీ అది. సోషల్ మీడియా పోరాటం అంటే.. ఏదో ఒక అద్దె భవనంలో కూలి కుర్రాళ్లని కూర్చోబెడితే చాలు.. హోరెత్తించేయవచ్చు. అందువల్ల వాళ్లకు గతిలేక సోషల్ మీడియా పోరాటం చేస్తారు.
తెలుగుదేశానికి ఏమైంది? జనసేన ఏం చేస్తే అది కాపీ కొడితే.. ఆ పార్టీ తమను ప్రేమిస్తుందని.. వన్ సైడ్ లవ్ చేస్తున్న చంద్రబాబు అనుకుంటున్నారా? అనేది ప్రజల సందేహం. దేశంలోనే తిరుగులేని ప్రాంతీయ పార్టీలలో ఒకటైన తెలుగుదేశం.. చివరికి జనసేనను కాపీ కొట్టి పోరాడే స్థాయికి దిగిపోయిందని జనం నవ్వుకుంటున్నారు.