ఆ మధ్య సినిమాల రిలీజ్ డేట్స్ వరుసగా ప్రకటించారు. ఆ తర్వాత అవే సినిమాలు వరుసగా వాయిదాలు పడినట్టు ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరో ప్రకటనల పరంపర కొనసాగుతోంది. అదే ఓటీటీ రిలీజ్. తమ సినిమా ఓటీటీలో నేరుగా రిలీజ్ అవ్వట్లేదంటూ క్లారిటీలిస్తూ వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి గుడ్ లక్ సఖి కూడా చేరింది.
రీసెంట్ గా ఈ సినిమాపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ కథనాలు వచ్చాయి. ఈ మేరకు జీ గ్రూప్ తో డీల్ కూడా అయిందన్నారు కొందరు. ఇంతకుముందు కీర్తిసురేష్ నటించిన పెంగ్విల్, మిస్ ఇండియా సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వడంతో, ఆమె కొత్త సినిమాపై వచ్చిన పుకారు కూడా నిజమవ్వొచ్చని చాలామంది భావించారు.
కానీ ఈ పుకార్లను గుడ్ లక్ సఖి యూనిట్ ఖండించింది. ఈ మేరకు సినిమా ప్రొడక్షన్ హౌజ్ నుంచి ప్రకటన వచ్చింది. గుడ్ లక్ సఖి సినిమా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందంటూ మీడియాలో వచ్చిన కథనాల్లో ఎలాంటి నిజం లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఓ అప్ డేట్ తో ప్రేక్షకులముందుకొస్తామంటూ తెలిపారు.
ఈమధ్య కాలంలో ఇలా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ చాలా సినిమాలపై ప్రచారం జరుగుతోంది. ఆ వెంటనే వాటిని ఖండిస్తూ సదరు నిర్మాణ సంస్థలు ప్రకటనలు కూడా చేస్తున్నాయి. సెకెండ్ వేవ్ తో నిర్మాతలు భయపడడం లేదు. ఎప్పుడు థియేటర్లు తెరిస్తే అప్పుడే రిలీజ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ఎస్ఆర్ కల్యాణమండపం లాంటి చిన్న సినిమా నిర్మాతలు కూడా తమ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని ప్రకటనలు ఇస్తున్నారు.