రోజువారీ కేసులు ల‌క్షకు.. జ‌నాలు రిలాక్స్!

గ‌త ఏడాది రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరిన‌ప్పుడు క‌రోనా ప‌తాక స్థాయిలో నిలిచింది. రోజుకు ల‌క్ష కేసులు వ‌చ్చిన‌ప్పుడు బాగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. అయితే ప‌ది నెల‌ల త‌ర్వాత ఇప్పుడు రోజుకు…

గ‌త ఏడాది రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష‌కు చేరిన‌ప్పుడు క‌రోనా ప‌తాక స్థాయిలో నిలిచింది. రోజుకు ల‌క్ష కేసులు వ‌చ్చిన‌ప్పుడు బాగా భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. అయితే ప‌ది నెల‌ల త‌ర్వాత ఇప్పుడు రోజుకు ల‌క్ష స్థాయిలో వ‌స్తున్నాయి క‌రోనా కేసులు. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌జ‌లు రిలాక్స్ అవుతున్నారు.

చాలా రాష్ట్రాల్లో సగం రోజు లాక్ డౌన్ అమ‌ల్లో ఉన్నా, ప‌లు రిస్ట్రిక్ష‌న్లున్నా.. కాసేపు స‌మ‌యంలోనే ప్ర‌జ‌లు ఫుల్ గా రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ప‌ట్ట‌ణాలు, మండ‌ల హెడ్ క్వార్ట‌ర్ల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు మాస్కు విష‌యంలో స్ట్రిక్ట్ గానే ఉంటున్నారు. మాస్కుల్లేకుండా రోడ్డుపై క‌నిపించే వారు ఇప్పుడు దాదాపు  లేరు. ఏప్రిల్ నుంచినే ఈ సారి మాస్కుల విష‌యంలో ప్ర‌జ‌లు చాలా క‌రెక్టుగానే ఉంటున్నారు. అయినా క‌రోనా వ్యాప్తి మాత్రం ఈ సారి తీవ్రంగానే సాగింది. 

అయితే ఇప్పుడిప్పుడు ప్ర‌జ‌లు మ‌ళ్లీ రిలాక్స్డ్ స్టేట‌స్కు వ‌స్తున్నారు. ప‌ల్లెల్లో ఇన్నాళ్లూ ప‌క్కింటి వైపు వెళ్ల‌డానికి కూడా భ‌య‌ప‌డేవారు. ఇప్పుడు చిన్న సైజులో పెళ్లి వేడుక‌లు కూడా జ‌రుగుతున్నాయి. వంద మంది స్థాయిలో ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు. ప‌ల్లెల్లో కూడా చాలా చోట్ల అనేక మందికి క‌రోనా వ‌చ్చి, పోయింది.

అలా ఆయా ఊర్ల‌లో వేవ్ ముగిసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 200 జ‌నాభా ఉన్న చాలా ప‌ల్లెల్లో కూడా ఈ సారి ప‌దుల సంఖ్య‌లో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాంటి చోట ఇక క‌రోనా రావ‌డానికి కూడా ఎవ‌రూ మిగ‌ల్లేదేమో అనే ప‌రిస్థితి త‌లెత్తింది. చాలా మందికి వ‌చ్చి వెళ్ల‌డం కూడా రిలాక్సేష‌న్ కు ఒక కార‌ణం.

ఏపీలో క‌రోనా భ‌యాందోళ‌న‌లు బాగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుల్లో రెండో వేవ్ లో క‌రోనా కేసుల సంఖ్య భారీ స్థాయికి చేరినా, ఏపీలో మాత్రం ఆ స్థాయికి వెళ్ల‌కుండానే వేవ్ త‌గ్గుముఖం ప‌డుతోంది. రోజువారీ కేసుల సంఖ్య ప‌ది వేల లోపుకు చేరింది. ఆసుప‌త్రుల్లో-కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో చికిత్స పొందుతున్న క‌రోనా పేషెంట్ల సంఖ్య 12 వేల స్థాయికి త‌గ్గింది. యాక్టివ్ కేసులున్నా.. ఇంట్లోనే ఉండి చికిత్స పొందే వారి శాతం 90కి పైనే ఉంది. క‌రోనా వ్యాప్తే కాకుండా, సోకిన వారిలో దాని తీవ్ర‌త కూడా త‌క్కువే అని స్ప‌ష్టం అవుతోంది.

ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల లోడు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ఉన్నాయి. ఇక ఢిల్లీ పూర్తిగా క‌రోనా ఫ్రీ అవుతోంది. గ‌త ఇరవై నాలుగు గంట‌ల్లో ఢిల్లీలో 381 క‌రోనా కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి.