దేశ ప్రజలందరికీ కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఇవ్వవయ్యా మోదీ అని వేడుకుంటుంటే. అ పని చేయకుండా తప్పును ఎవరి నెత్తిపై వేద్దామా? అనే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోట్ దేనికి సంకేతం? కరోనా అదుపులో ఉండి ఉంటే …ఆ ఘనత తమ ఖాతాలో వేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తహతహలాడేది.
కరోనా సెకెండ్ వేవ్ మన దేశంలో విజృంభించడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం అని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. దీంతో ఆ పాపాన్ని, తప్పుల్ని రాష్ట్రాలపై నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ప్రకారం సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల వల్లే దేశ వ్యాప్తంగా తొలినాళ్లలో టీకా కార్యక్రమం నెమ్మదించడానికి కారణమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారికంగా ఓ నోట్ విడుదల చేయడం గమనార్హం. ఈ రాష్ట్రాలకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 5.65 కోట్ల డోసుల టీకా అందుబాటులోకి ఉన్నప్పటికీ 2.60 కోట్ల డోసులు మాత్రమే ఉపయోగించాయని పేర్కొంది.
జూన్ 4 నాటికి జాతీయస్థాయిలో సగటున 81% వైద్య సిబ్బందికి టీకా అందించగా, మహారాష్ట్ర 77%, ఢిల్లీ 73%, పంజాబ్ 65%, తెలంగాణ 64% తర్వాత స్థానల్లో ఉన్నాయని నోట్‌లో పేర్కొంది. ప్రజల్లో టీకా పనితీరు పట్ల సందేహాలు పెరగడానికి ప్రతిపక్షాలు కారణమయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆరోపించింది. కేంద్రం ప్రకటించిన రాష్ట్రాల జాబితాల్లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు మాత్రమే ఉండడం గమనార్హం.
చివరికి టీకాల విషయంలోనూ కేంద్రం రాజకీయం చేయడంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ అసమర్థతను, చేతకానితనాన్ని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నమే తప్ప, ఇప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం శ్రద్ధ చూపలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.